దళిత బంధు కార్యక్రమ ప్రారంభ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కేంద్రంగా ఈ నెల 16 న సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్నారు. వేలాది మందితో ఆ రోజు సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రులు కొప్పుల ఈశ్వర్, గుంగుల కమలాకర్ శనివారం కరీంనగర్ కలెక్టరేట్ లో సమీక్ష ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా సీఎం సభను సక్సెస్ చేసేందుకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఆ తర్వాత మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు.

దేశంలోనే ఎక్కడ లేదు

దళిత బంధు లాంటి పథకం దేశంలోనే ఎక్కడ లేదని కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత వర్గాల బాగు కోసం సీఎం కేసీఆర్ గొప్పగా ఆలోచించి ఈ పథకాన్ని రూపొందించారని చెప్పారు. దళితబంధు అమలుపై కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇప్పటికే చర్చించి స్పష్టమైన ఆదేశాలిచ్చారని..పైరవీలకు ఎలాంటి అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఈ నెల 16 న సీఎం చేతుల మీదుగా జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ లాల్, పోలీస్ ఉన్నతాధికారులతో పాటు అన్ని ముఖ్య శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.