భారత్‌కు చేరిన మిరాజ్‌-2000 ఫైటర్ జెట్స్

Mirage-2000-fighter-jet

ఫ్రాన్స్‌ నుంచి రెండు మిరాజ్‌-2000 ఫైటర్ జెట్స్ భారత్‌కు చేరాయి. ఫ్రాన్స్‌ వినియోగించిన వీటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్‌) కొనుగోలు చేసింది. ఈ క్రమంలో రెండు మిరాజ్‌-2000 ఫైటర్ జెట్స్ వైమానిక దళంతో కలిసి ప్రయాణించి గ్వాలియర్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

వీటి రాకతో ఫైటర్ ఫ్లీట్‌లోని మిరాజ్ విమానాల సంఖ్య 51కి చేరాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో జరుగుతున్న మిరాజ్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ విమానాలను అప్‌గ్రేడ్ చేయనున్నారు. 1980 నుంచి మిరాజ్‌లు భారత వాయుసేనకు సేవలందిస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మూడు స్క్వాడ్రన్‌లలోని 51 విమానాల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఫ్రెంచ్, భారత్‌ మధ్య మిరాజ్ అప్‌గ్రేడ్ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మిరాజ్‌ల విడిభాగాలను దశలవారీగా సేకరించేందుకు పాత ఫ్రెంచ్ విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొంటుంది. దీంతో 2035 వరకు మిరాజ్‌లను నిర్వహించడానికి వైమానిక దళానికి ఇది సహాయపడుతుందని ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించారు.