మిథాలీగా అదరగొట్టిన తాప్సీ.. ‘శభాష్‌ మిథు’ ట్రైలర్‌

ప్రముఖ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘శభాష్‌ మిథు’.  ఇందులో నటి తాప్సీ పన్ను టైటిల్‌ రోల్‌ పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. దాదాపు రెండు దశాబ్దాలపాటు క్రికెట్ కు సేవలందించిన మిథాలీ ఇటీవలే క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

చిన్నతనం నుంచి క్రికెటర్‌ కావాలని మిథాలీ ఎంతగా ఆరాటపడింది.. క్రికెటర్‌గా ఎదిగే సమయంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొంది.. మహిళల క్రికెట్‌కు గుర్తింపు తీసుకురావడం కోసం ఆమె ఎంతలా శ్రమించింది.. ఇలా ప్రతి విషయాన్నీ ఈ సినిమాలో చూపించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

వయాకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈసినిమా జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.