బీజేపీ పాలనలో పేదలు బతికే పరిస్థితి లేదు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలల గ్రామంలో బిజిగిరి షరీఫ్, శాయం పేట, గండ్రపల్లి, తనుగుల, వావిలల, నగురం, పాపక్క పల్లి, శంభునిపల్లి, గోపాలపురం గ్రామాల యువతతో నిర్వహించిన సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్,  ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం నిత్యం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతుందన్నారు. ఈ ధరలు పెరగడం వల్లనే నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయి. బీజేపీ పాలనలో పేదలు బతికే పరిస్థితి లేదు. మనకు రావాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలను పక్క రాష్ట్రాలకు తరలించారు. బీజేపీ.. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది. వావిలల గ్రామంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాము. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకొని.. హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు.

ఎమ్మెల్యే ఆరూరి మాట్లాడుతూ.. యువతను ప్రోత్సహిస్తున్న పార్టీని ఆదరించండి. ఎంతోమంది యువకులకు అవకాశాలు ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్. యువకుడు, ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించుకుందాం. తెలంగాణ రాష్ట్రం లో బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో అనేక కంపెనీలు తెలంగాణ కు తరలివస్తున్నాయి. లక్షలాది ఉద్యోగాలు ఇక్కడి యువతకు వచ్చాయి. యువతకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.