మారుమూల ప్రాంతాలకు మొబైల్ నెట్‌వర్క్.. కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

mobile network

మొబైల్ నెట్‌వర్క్ అందని ప్రాంతాలకు 4జీ సర్వీసులు అందించే స్కీమ్‌ను కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో స్కీమ్ అమలు కానుంది. 44 జిల్లాల్లో 7,287 గ్రామాలకు 4జీ మొబైల్ సర్వీసులు అందనున్నాయి. ఈ పథకం కోసం రూ. 6,466 కోట్ల అంచనా వ్యయంగా పేర్కొన్నారు. ఓపెన్ కాంపిటిషన్ పద్ధతిలో బిడ్లకు ఆహ్వానిస్తారు.

గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు డిజిటల్ ఇండియా సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కొత్త ఫథకాన్ని తెచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఆన్‌లైన్ విద్యకు, కొత్త ఉద్యోగ అవకాశాలకు ఈ కొత్త పథకం ఊతమిస్తుందని కేంద్రం తెలిపింది.

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన – I, II పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సరైన రోడ్ సదుపాయం లేని మైదాన ప్రాంతాలు, ఈశాన్య, హిమాలయ రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించగా.. ఇందుకోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,12,419 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. గ్రామీణ రోడ్ల నిర్మాణంలో సరికొత్త పర్యావరణ మిత్ర విధానాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పట్టణీకరణ, ఉపాధి కల్పనకు రోడ్లు కీలకంగా మారనున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అమలుచేస్తున్న పథకాన్ని 2023 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

2016 నుంచి 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో 105 బ్రిడ్జిలతో పాటు 4,490 కి.మీ రోడ్ల నిర్మాణం చేపట్టగా.. ఇంకా 5,714 కి.మీ మేర రోడ్లు, 358 బ్రిడ్జిలు పెండింగులో ఉన్నాయి. వీటికి అదనంగా 1,887 కి.మీ రోడ్లు, 40 బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.