11 దేశాలకు పాకిన మంకీపాక్స్.. అప్రమత్తమైన భారత్

  • డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికతో అప్రమత్తమైన భారత్
  • బయటదేశాల నుంచి వచ్చేవారికి ఐసోలేషన్  
  • మంకీపాక్స్ మరో కోవిడ్-19గా మారుతుందా?

ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో మరో అంటువ్యాధి యావత్ ప్రపంచాన్ని భయపెడుతోంది. తాజాగా మంకీపాక్స్ అనే వైరస్ కొన్ని దేశాలలో వ్యాప్తి చెందుతోంది. అమెరికా, కెనడా, నైజీరియా, యూకే దేశాలలో రోజూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంకీపాక్స్ కేసులు 11 దేశాలలో నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. దాంతో భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు పూనుకుంది. అందులో భాగంగా మంకీపాక్స్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే వారిని ఐసోలేషన్ లో ఉంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరియు ఐసీఎంఆర్ ను ఆదేశించారు. అంతేకాకుండా.. ఎయిర్‎పోర్టు, ఓడరేవు ఆరోగ్య అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

‘మంకీపాక్స్ ప్రభావిత దేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులను ఐసోలేషన్ లో ఉంచాలి. వారి నుంచి నమూనాలు సేకరించి పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‎కు పంపాలి’ అని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

మంకీపాక్స్ లక్షణాలు, సోకే విధానం
మంకీపాక్స్ అనేది సోకిన తర్వాత రెండు నుంచి నాలుగు వారాల పాటు ఉంటుంది. గాయాలు, శరీర ద్రవాలు, శ్వాసకోశ చుక్కలు, వ్యాధి సోకిన వ్యక్తి వస్తువులు వాడినా, సన్నిహిత సంబంధం పెట్టుకున్నా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ మంకీపాక్స్ మశూచిని పోలి ఉంటుందని.. అయితే దీని లక్షణాలు మాత్రం మశూచి కంటే తక్కువగా ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మంకీపాక్స్ సాధారణంగా జ్వరం, దద్దుర్లు, వాపు లక్షణాలతో ఉంటుంది. ఈ వ్యాధి సోకిన తర్వాత ఇతర వైద్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. మంకీపాక్స్ వల్ల కలిగే మరణాల శాతం 3 నుంచి 6 శాతంగా ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వైరస్ తల్లి నుంచి పిండానికి, పుట్టిన సమయంలో కానీ, పుట్టిన తర్వాత కానీ సంక్రమించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

మంకీపాక్స్ మరో కోవిడ్-19గా మారుతుందా?
అయితే ఈ మంకీపాక్స్ మరో కోవిడ్-19గా మారుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కరోనా వల్ల అయినవారినందరినీ కోల్పోయిన బాధలో ఉంటే.. మళ్లీ మంకీపాక్స్ ఏంటి అని ప్రజలు భయపడుతున్నారు. అయితే ఈ వైరస్ కోవిడ్ మాదిరిగా అంత తేలికగా వ్యాపించదని, కోవిడ్ -19 వంటి మహమ్మారిగా పరిణామం చెందదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.