కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని కేంద్రం దాటవేస్తోంది

MP Vaddiraju Ravichandra

తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం మరోసారి రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. ఇవాళ (శుక్రవారం) రాజ్యసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.. కేంద్రాన్ని రైల్వే సంబంధిత అంశాలపై ప్రశ్నించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సభలో ప్రశ్నను లేవనెత్తారు. ఈ అంశం రాష్ట్రాల పునర్విభజన చట్టంలో కూడా పొందు పర్చారని.. తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కూడా దీనిపై కేంద్రానికి పలు దఫాలుగా విజ్ఞప్తులు చేశారని వద్దిరాజు గుర్తు చేశారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పై సమాధానం చెప్పాలని ఆయన రాజ్యసభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

అయితే.. ఈ ప్రశ్నపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమాధానాన్ని దాటవేశారు. దీనిపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం తెలంగాణ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉందన్నారు. రాష్ట్రాల పునర్విభజన చట్టంలో తెలిపిన అంశంపై సమాధానం ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం ఎప్పటిలాగే నిరాకరించిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల కేంద్రానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనేది మరోసారి స్పష్టమైందని అన్నారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోతోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాలని కోరారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.