నాగాలాండ్ హింస.. పోలీసు శాఖ నివేదిక.. కీలక అంశాలు వెల్లడి

Nagaland-Violence

నాగాలాండ్‌లో ఈ నెల 4న సైన్యం జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చెలరేగిన హింసపై నాగాలాండ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర పోలీసు శాఖ నివేదిక సమర్పించింది.

నివేదికలో పలు కీలక అంశాలు బయటకు వచ్చాయి. గని నుంచి తిరిగి వస్తున్న కార్మికులను ఉగ్రవాదులా.. కాదా.. అని నిర్ధారించుకోకుండానే సైన్యం కాల్పులు జరిపిందని నాగాలాండ్ డీజీపీ, కమిషనర్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో స్పష్టం చేశారు.

Nagaland-Violence-1

8 మంది గని కార్మికులు.. పని ముగించుకుని వాహనంలో వస్తుండగా సైన్యానికి చెందిన ప్రత్యేక దళం వారిపై మెరుపుదాడి చేశారు. ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవని నివేదికలో తెలిపారు.

కార్మికుల మృతదేహాలను సైన్యం వాహనంలో తరలిస్తుండగా.. గ్రామస్థులు చూశారని.. ఆగ్రహించిన స్ధానికులు.. భద్రతా దళాలతో ఘర్షణకు దిగారని నాగాలాండ్ పోలీసు శాఖ వెల్లడించింది.

భద్రతా దళాలకు చెందిన మూడు వాహనాలకు స్ధానికులు నిప్పు పెట్టారని,  ఈ క్రమంలో సైన్యం కాల్పులు జరపగా.. మరో ఏడుగురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తమ నివేదికలో స్పష్టం చేశారు.