12 మంది బాలికలపై అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు

ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహిస్తున్న వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న 12మంది బాలికలపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని ఏనమీద తండాలో ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న హాస్టల్ లో పనిచేస్తున్న రమావత్ హరీశ్ నాయక్ 12 మంది మైనర్లపై మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. వసతిగృహ నిర్వాహకుడు శ్రీనివాస్, నిందితుడి భార్య సరితలు ఈ ఘటనలో నిందితుడు హరీశ్ నాయక్ కు సహకరించారు. వారికి కూడాకోర్టు జైలు శిక్ష విధించింది.


గుంటూరు జిల్లా నాగారం మండల కేంద్రానికి చెందిన భార్యాభర్తలు నన్నం శ్రీనివాసరావు, సరితలు విలేజ్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ ఆర్గనైజేషన్‌(వీఆర్‌వో) అనే ప్రైవేటు సంస్థను ఏర్పాటు చేసి బాలికల వసతిగృహాన్ని నడుపుతున్నారు. ఈ వసతి గృహంలో బాలికలను చదివించేందుకు ట్యూటర్‌గా రమావత్‌ హరీశ్‌ రోజూ అక్కడికి వచ్చేవాడు. ఈ క్రమంలో అక్కడ 12 మంది మైనర్లపై మూడు నెలలపాటు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరైనా ఎదురుతిరిగితే చంపేస్తానని బెదిరించేవాడు. అతడికి శ్రీనివాసరావు, సరితలు సైతం సహకరించారు. తమపై అత్యాచారం జరుగుతున్నదన్న విషయం 2014 ఏప్రిల్‌ 3న ఓ బాధిత బాలిక ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మిగతా బాలికలపైనా అత్యాచారం జరిగినట్లు విచారణలో గుర్తించి.. 12 మంది బాలికల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితుడిపై వేర్వేరుగా 12 కేసులలో ఛార్జిషీట్లు దాఖలు చేశారు. విచారణలో 10 కేసులలో నేరం చేసినట్టు రుజువైంది. దీంతో హరీశ్‌, శ్రీనివాసరావులకు జీవితఖైదు, రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. బెదిరింపులకు పాల్పడినందుకు హరీశ్‌కు మరో రెండేళ్లు, అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.