నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ శనివారం అర్ధరాత్రి హ్యాకింగ్‌కు గురైంది. సాంకేతిక నిపుణులు ఖాతాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్ డీజీ ఆదివారం తెలిపారు. ఇటీవల వరుసగా భారత్‌లో ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్ బారినపడుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రధానమంత్రి నుంచి సెలబ్రిటీల వరకూ ఈ హ్యాకింగ్ బాధలు తప్పడం లేదు. ఇటీవల ప్రధాని మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైన సంగతి తెలిసిందే. ఈ నెల 12న కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికార ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ చేసిన హ్యాకర్లు ‘ఎలాన్ మస్క్’గా మార్చడంతో పాటు 50కిపైగా వరుస ట్వీట్లు చేశారు.
అయితే ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. తమ శాఖకు చెందిన ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురయిందని, దాని పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే పునరుద్ధరిస్తామని చెప్పారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం 2006లోనే ఎన్డీఆర్ఎఫ్ ఫెడరల్ విభాగం ఏర్పడింది. జనవరి 19నే ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు.