ఉక్రెయిన్ సంక్షోభం: తూర్పు ఐరోపాకు నాటో యుద్ధనౌకలు, విమానాలు

NATO warships and aircraft to Eastern Europe

ఉక్రెయిన్ పై రష్యా ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తుగా త‌మ సైనిక ద‌ళాల‌ను సిద్ధంగా ఉంచిన‌ట్లు నాటో తెలిపింది. ఈ మేరకు రష్యా దాడులకు దిగితే అడ్డుకునేందుకు వీలుగా తూర్పు ఐరోపాకు మ‌రిన్ని యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల‌ను త‌ర‌లిస్తున్న‌ట్లు పశ్చిమ సైనిక కూటమి సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ వెల్ల‌డించారు.

ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్షకు పైగా సైనికులను, యుద్ధట్యాంకులను, మిస్సైల్స్ ని మోహరించిన విషయం తెలిసిందే. రష్యా దాడి ముప్పు నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లోని త‌మ రాయబార కార్యాలయం నుండి తమ సిబ్బందిని, పౌరులను  తిరిగి వచ్చేయాలని బ్రిటన్, అమెరికాలు పిలుపునిచ్చాయి.

మ‌రోవైపు అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు ఉక్రెయిన్‌పై దాడి చేయవద్దని రష్యాను హెచ్చరించాయి. దాడికి తెగబడితే మునుపెన్నడూ చూడని ఆర్థిక ఆంక్షలు విధిస్తామని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాయి. కాగా ఉక్రెయిన్‌పై దాడికి సిద్ధంగా ఉన్న‌ట్లుగా జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ర‌ష్యా ఖండించింది. అక్క‌డి ప‌రిస్థితిని నాటో మ‌రింత జ‌టిలం చేస్తున్న‌ద‌ని ఆరోపించింది.

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అంశంపై అమెరికా, ర‌ష్యా మ‌ధ్య శుక్ర‌వారం జ‌రిగిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. ఈ క్రమంలో త‌మ లిఖిత పూర్వ‌క డిమాండ్ల‌పై ప్ర‌తిస్పంద‌న కోసం ర‌ష్యా వేచి చూస్తున్న‌ది.