ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. విడుదల చేయాలంటే నువ్వేం చేయాలో తెలుసా అంటూ షారుఖ్ కి ఫోన్

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ నిందితుడుగా ఉన్న క్రూయిజ్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఆర్యన్ ను విడుదల చేయాలంటే రూ.25 కోట్లు చెల్లించాలంటూ ఓ ఎన్సీబీ అధికారితో పాటు మరి కొంతమంది షారుక్ ఖాన్ ను డిమాండ్ చేశారంటూ ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్ సాయిల్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. షారుక్ ని డిమాండ్ చేసిన రూ.25 కోట్లలో రూ.8కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు ఇవ్వాలని కూడా మాట్లాడుకుంటుంటే విన్నానని ప్రభాకర్ చెప్పారు.


అక్టోబర్ 2న వాంఖడే టీమ్.. ఓ రేవులోని నౌకలో జరుగుతున్న డ్రగ్స్ పార్టీ మీద ఎన్సీబీ నేతృత్వంలో దాడులు చేశారు. ఆ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. అయితే.. దాడి చేసిన సమయంలో తనతో పాటు మొత్తం 9మంది దాడుల్లో పాల్గొన్నట్టు సాక్షి ప్రభాకర్ తెలిపారు. ఎన్సీబీ నుంచి మరో సాక్షిగా ఉన్న గోసావి అనే అధికారికి ప్రభాకర్ బాడీగార్డుగా పనిచేస్తున్నారు. ఆర్యన్ ను ఎన్సీబీ ఆఫీసుకు తీసుకొచ్చిన తర్వాత శామ్ డిసౌజా అనే వ్యక్తితో గోసావి ఫోన్ కాల్ మాట్లాడాడని ప్రభాకర్ చెప్తున్నారు. ఆర్యన్ ఖాన్ ని విడుదల చేయాలంటే రూ.25 కోట్లు కావాలని అడగాలని.. చివరికి రూ.18 కోట్లకు బేరం మాట్లాడమని.. అందులో రూ.8 కోట్లు ఎన్సీబీ అధికారి వాంఖడేకు ఇవ్వాలని డిసౌజా అనే అధికారికి గోసావి చెప్పాడని ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్ తెలిపారు. ఆ తర్వాత గోసావి, డిసౌజాలు కలిసి షారుక్ మేనేజర్ పూజా దద్లానీని కలిశారు. ఆ ఇద్దరు తిరిగి వచ్చి రూ.50 లక్షలు ఇచ్చారని, అందులోని రూ.38 లక్షలు తిరిగిచ్చాడని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో తెలిపారు. తనతో వాంఖడే, గోసావి 10 ఖాళీ పేపర్ల మీద సతకం చేయించుకున్నట్టు ప్రభాకర్ తెలిపారు.


2018 సంవత్సరంలో ఓ చీటింగ్ కేసుకు సంబంధించి గోసావి కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసు వేశారు. అయితే.. మొత్తం ఎన్సీబీ ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రభాకర్ ఈ ఆరోపణలు చేస్తున్నాడని ఆ సంస్థ అధికారులు ప్రకటిస్తున్నారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున, ప్రభాకర్‌ తన వాంగ్మూలాన్ని న్యాయస్థానానికే తెలుపాలని సూచించారు. వాంఖడే ప్రాణానికి హాని కలగకుండా మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని కేంద్ర మంత్రి రాందాస్‌ అఠవాలే కోరారు. డ్రగ్స్‌ వ్యవహారంలో ఆర్యన్‌ పాత్రపై ఎన్‌సీబీ వద్ద ఆధారాలున్నాయన్నారు.