కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపచ దేశాలను చుట్టేస్తూనే ఉంది.. కొన్ని దేశాలపై విరుచుకుపడుతోంది.. మరికొన్ని దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ మహమ్మారి వల్ల తన పెండ్లిని రద్దు చేసుకున్నారు న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్. కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆ దేశంలో కరోనా ఆంక్షలను కఠినతరం చేశారు. దీంతో తన పెండ్లిని రద్దు చేసుకుంటున్నట్లు పీఎం జసిండా ప్రకటించారు. క్లార్క్ గేఫోర్డ్తో చాలాకాలంగా కలిసిఉంటున్న ఆర్డెర్న్.. తమ వివాహ తేదీని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. మరికొద్ది రోజుల్లోనే వారు వివాహం చేసుకోవాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో నిబంధనలు కఠినతరం చేశారు.
మహమ్మారి వల్ల ఇలాంటి అనుభవంపొందిన వారిలో తానుకూడా చేరానని ప్రధాని ఆర్డెర్న్ చెప్పారు. కరోనా నిబంధనల వల్ల ఇబ్బందిపడుతున్న వారు తనను క్షమించాలని ఆమె ప్రజలను కోరారు. ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తున్నదని, అయితే దీనివల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం తక్కువగా ఉందన్నారు.