కివీస్‌ లక్ష్యం 284 పరుగులు.. శ్రేయస్‌ అయ్యర్‌ కొత్త రికార్డు

shreyas-ayyar

న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ రెండో ఇన్నింగ్స్ ను 234/7 స్కోరు దగ్గర డిక్లేర్డ్ చేసింది. దీంతో కివీస్‌ లక్ష్యం 284 పరుగులుగా నిర్దేశించింది.  తొలి ఇన్నింగ్స్‌ 49 పరుగుల ఆధిక్యం వచ్చిన సంగతి తెలిసిందే.

శ్రేయస్‌ అయ్యర్ (65), వృద్ధిమాన్‌ సాహా (61*) అర్ధశతకాలు సాధించారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (32), అక్షర్‌ పటేల్ (28*), పుజారా (22), మయాంక్‌ అగర్వాల్ (17) రాణించారు. కివీస్ బౌలర్లలో టిమ్‌ సౌథీ 3, జేమీసన్ 3, అజాజ్‌ పటేల్ ఒక వికెట్‌ తీశారు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్ స్కోరు 345/10, న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ 296/10.

కివీస్‌ తొలి వికెట్‌ డౌన్‌

284 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆదిలోనే తొలివికెట్ కోల్పోయింది.  ఓపెనర్‌ విల్‌ యంగ్‌ (2)ను అశ్విన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో న్యూజిలాండ్‌ మూడు పరుగులకే మొదటి వికెట్‌ను కోల్పోయింది.

మొదటి భారతీయ క్రికెటర్‌

టెస్టుల్లో టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించి రికార్డు సృష్టించిన శ్రేయస్‌ అయ్యర్‌ మరో అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శతకం, రెండో ఇన్నింగ్స్ లో అర్ధశతకం సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్ గా రికార్డు నమోదు చేశాడు. అంతర్జాతీయంగా పదో ఆటగాడు కావడం విశేషం.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్‌ ఇన్నింగ్స్ లో 105, రెండో ఇన్నింగ్స్ లో 65 పరుగులు చేశాడు. ఇంతకుముందు 1933-34 సీజన్‌లో దిలావర్‌ హుస్సేన్‌ (59, 57), 1970-71 సీజన్‌లో విండీస్‌ మీద సునిల్‌ గావస్కర్ (65,67*) డెబ్యూ టెస్టులోనే రెండు ఇన్నింగ్స్ ల్లో అర్ధశతకాలు సాధించారు.

తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లు కలిపి అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌ మూడో స్థానంలో నిలిచాడు. అయ్యర్‌ కంటే ముందు వరుసలో శిఖర్‌ ధావన్‌ (2012/13 సీజన్‌: 187), రోహిత్ శర్మ (2013/14 సీజన్‌: 177)ఉన్నారు.