స్టాక్ మార్కెట్ లో రక్తపాతం. కొంపముంచిన కొత్త వేరియంట్.

స్టాక్ మార్కెట్ లో శుక్రవారం ట్రేడింగ్ ఇన్వెస్టర్లకు రక్తకన్నీరును మిగిల్చింది. అన్ని అపశకునలే ఉండటంతో సెన్సెక్స్, నిప్టీ దారుణంగా పడిపోయాయి. ఈ రెండు సూచీలు ఒక్కరోజులోనే దాదాపు 3 శాతం పడిపోయాయి. మార్కెట్లు ప్రారంభం కావటానికి ముందే నెగిటివ్ సెంటిమెంట్ ఉండటంతో నష్టాలతో ట్రేడింగ్ మొదలైంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ కు సంబంధించిన వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఇక రిటైలర్లు, బడా ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీనికి తోడు మార్కెట్లో కొన్ని రోజులుగా ఎఫ్ఐఐ లు అమ్మకాల వైపే ఉంటున్నారు. తాజాగా యూరప్ లో కరోనా కేసులు పెరగటం, సౌత్ ఆఫ్రికాలో కొత్త వేరియంట్ కారణంగా మరింత జోరుగా స్టాక్స్ సేల్ చేశారు. దీంతో సెన్సెక్స్, నిప్టీ వేగంగా పతనమయ్యాయి. ట్రేడర్స్ కు ఇదొక బ్లాక్ ఫ్రై డే గా మిగిలిపోయింది.

సెన్సెక్స్ 1690..నిప్టీ 510 పాయింట్ల పతనం

గతేడాది కరోనా ఎఫెక్ట్ కారణంగా భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత గోడకు కొట్టిన బంతిలా వేగంగా రికవరీ అయ్యాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి మొన్నటి అక్టోబర్ వరకు స్టాక్ మార్కెట్ల అన్ని సూచీలు భారీగా పెరిగాయి. ఐతే నవంబర్ నాటి నుంచి మార్కెట్లో ఫారెన్ ఇన్వెస్టర్లు సెల్లింగ్ చేస్తున్నారు. దీంతో ట్రేడింగ్ ఒడిదొడుకులకు లోనవుతుంది. గత వారం సెన్సెక్స్, నిప్టీ భారీగా పతనమైనప్పటికీ రెండు రోజుల్లోనే తిరిగి కోలుకున్నాయి. కానీ శుక్రవారం ట్రేడింగ్ లో మాత్రం ఊహించని విధంగా పతనం కొనసాగింది. సెన్సెక్స్ 58,254.79 పాయింట్ల వద్ద లాస్ లో మొదలైంది. నెగిటివ్ సెంటిమెంట్ తో ఒక దశలో 56,993 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 1688 పాయింట్ల భారీ నష్టంతో 57,107.15 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17,338 పాయింట్ల వద్ద మొదలై ఆరంభంలో స్వల్పంగా పెరిగి 17, 355.40 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ కారణంగా భారీగా పతనం మొదలైంది. 16,985.70 వద్ద కనిష్ఠాన్ని తాకింది. గత ఏప్రిల్ తర్వాత మార్కెట్ ఇంతలా ఫాల్ అవ్వటం ఇదే తొలిసారి. మార్కెట్ ముగిసే సమయానికిక 516.45 పాయింట్లు నష్టపోయి 17,026.45 వద్ద స్థిరపడింది. నిప్టీ 50 లోని సిప్ల, రెడ్డీస్ ల్యాబ్, దివి ల్యాబ్, నెస్లే ఇండియా నాలుగు షేర్లు మినహా అన్ని స్టాక్స్ నష్టపోయాయి.

అన్ని అపశకునాలే

మార్కెట్లు పతనం కావటానికి ప్రధాన కారణం సౌత్ ఆఫ్రికాలోని కొత్త వేరియంట్ అయినప్పటికీ..దీనితో తోడు మరిన్ని కారణాలు కూడా కలిసొచ్చాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో మళ్లీ థర్డ్ వేవ్ తప్పదని లాక్ డౌన్ మరొసారి ఉండే అవకాశం ఉందన్న అంచనాలతో చాలా మంది స్టాక్స్ అమ్మేశారు. అటు యూరోప్ లో కొన్ని దేశాలు ఇప్పటికే కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దీనికి తోడు అమెరికా ఫెడ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందన్న వార్తలు కూడా మార్కెట్లపై ఎఫెక్ట్ చూపాయి. ఇక కొన్ని రోజుల నుంచి ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ ఉండనే ఉంది. సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగిందంటే బ్యాంకులు మార్కెట్లోకి క్యాష్ ఫ్లో ను తగ్గిస్తాయి. ఈ భయం కొన్ని రోజులుగా మార్కెట్లను వెంటాడుతూనే ఉంది. దీనికి మిగతా కారణాలు కూడా తోడవ్వటంతో స్టాక్ మార్కెట్లు ఇవ్వాళ పెద్ద ఎత్తున పతనమ్యాయి.

5 లక్షల కోట్లు ఆవిరి

మార్కెట్లు భారీగా పతనం కావటంతో ఒక్క బీఎస్ఈలోనే శుక్రవారం రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. చాలా సంస్థల షేర్ వ్యాల్యు పడిపోయింది. ఐతే భారత స్టాక్ మార్కెట్లు ఓవర్ వ్యాల్యూ లో ట్రేడ్ అవుతున్నాయని కొన్ని రోజులుగా ఇంటర్నేషనల్ ఎకానమిక్స్ ఏజెన్సీలు హెచ్చరించాయి. అలా అన్ని కారణాలు కలిసి రావటంతో రిస్క్ ఎందుకులే అనుకున్న చాలా మంది స్టాక్స్ ను అమ్మేసుకున్నారు.