విద్యా సంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఆందోళన వద్దు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Minister Sabita Indrareddy

విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవని, కేసుల నమోదుపై సోషల్ మీడియాలో వస్తోన్న దష్ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరెంట్స్ కు సూచించారు. కరోనా వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదని, విద్యా సంస్థల్లో పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌పై జడ్పీ కార్యాలయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు ఏమీ లేవని స్పష్టం చేశారు. పాఠశాలలు, వసతి గృహాల్లో నూరు శాతం రెండు డోసులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను మంత్రి ఆదేశించారు.

రెండో డోసు విషయంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయించాలని ఆమె సూచించారు. కొన్ని చోట్ల స్పల్పంగా కేసులు నమోదు అవుతున్నాయని, విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆమె.. ఇప్పటికే విద్యార్థులు రెండేళ్లు నష్టపోయిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితులు వస్తే ప్రభుత్వం తప్పకుండా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సబిత వివరించారు.