కరోనా ఎఫెక్ట్ : ప‌ది మందిలో ఒక చిన్నారి బాల కార్మికుడు

ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య పెరిగింది. రెండు దేశాబ్ధాల త‌ర్వాత ఈ స్దాయిలో బాల కార్మికుల సంఖ్య పెరగడం ఇదే మొదటిసారి. కరోనా మహమ్మారి కారణంగా కుటుంబాల్లో ఏర్పడిన ఆర్ధిక పరిస్ధితులే ఇందుకు కారణం. ఎక్కువ సంఖ్యలో యువ‌కులు కూడా ఇలాంటి భ‌విత‌వ్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఐక్యరాజ్య‌స‌మితి చెప్పింది.

అంత‌ర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్ఓ) మరియూ యూఎన్‌కు చెందిన యునిసెఫ్ సంస్ధలు ఈ రిపోర్ట్‌ను సంయుక్తంగా త‌యారు చేశాయి. 2020 లెక్కల ప్రకారం బాల‌కార్మికుల సంఖ్య 16 కోట్లు ఉంద‌ని, గ‌త నాలుగేళ్ల‌లోనే కొత్తగా మరో 84 ల‌క్ష‌ల మంది బాల కార్మికులుగా మారినట్లు ఆ నివేదిక చెప్పింది. క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన త‌ర్వాత ప‌ది మందిలో ఒక చిన్నారి బాల కార్మికుడిగా ఉన్నట్లు రిపోర్ట్‌లో తెలిపారు. ఆఫ్రికాలో ఇది మ‌రీ ఎక్కువ‌గా ఉంది. రానున్న రెండేళ్ల‌లో మ‌రో 5 కోట్ల మంది చిన్నారులు బాల కార్మికులుగా మారే ప్ర‌మాదం ఉంద‌ని యూఎన్ హెచ్చరించింది. బాల కార్మిక వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా నిర్మూలించ‌డంలో విఫ‌లం అవుతున్న‌ట్లు యునిసెఫ్ చీప్ హెన్రిటా ఫోరే తెలిపారు. కోవిడ్ వ‌ల్ల ప‌రిస్థితి మ‌రింత ఎక్కువ అవుతుందని ఆమె చెప్పారు.