రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. అవినీతి ఆరోపణలు, భూఆక్రమణల కేసులో మంత్రివర్గం నుంచి తొలగించబడ్డ ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే బై ఎలక్షన్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారట.
సెప్టెంబర్‌లోనే హుజురాబాద్ ఉపఎన్నిక ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం నుంచి పార్టీలకు సంకేతాలు అందినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో 80శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమయంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక రానుండటంతో ఆ నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ వేగం పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అక్కడి ఓటర్లతో పాటు నేతలకు విస్తృతంగా వ్యాక్సిన్ వేయడంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి కూడా ముందే టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.