పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన గణనాధుడు.. బయటపడ్డ పురాతన శిల్పాలు - TNews Telugu

పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన గణనాధుడు.. బయటపడ్డ పురాతన శిల్పాలుతెలంగాణ శిల్ప సంపదకు పుట్టినిల్లు. ఈ నేలలో అడుగడుగున శిల్ప సంపద ఉట్టిపడుతుంది. రాజులేలి.. వందల సంవత్సరాలు గడిచినా.. ఈ గడ్డ మీద ఇప్పటికీ గడ్డపార వేస్తే చాలు కండ్లు చెదిరే శిల్పాలు దొరుకుతాయి. తాజాగా సంగారెడ్డిలో ఈ విషయం మరోసారి రుజువైంది. జిల్లాలోని నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో ఓ రైతు పొలంలో గణేషుడి విగ్రహం, విగ్రహాన్ని పెట్టే పీఠం బయటపడ్డాయి.

Oldest Ganesh Idol Found In Sangareddy
Oldest Ganesh Idol Found In Sangareddy

తుర్కపల్లి గ్రామానికి చెందిన అనంత్ రావు దేశ్ ముఖ్ అనే రైతు సాయంత్రం సమయంలో తన వ్యవసాయ భూమిలో పొలం దున్నుతుండగా నాగలికి ఏదో తట్టినట్టుగా అనిపించింది. ఎంత ప్రయత్నించినా నాగలి ముందుకు కదలకపోవడంతో అనుమానం వచ్చి ఆ రైతు వెళ్లి చూడగా.. నాగలికి ఏదో రాయి తట్టుకున్నట్టు గ్రహించాడు. తవ్వి చూడగా.. పురాతన కాలానికి చెందిన గణపతి విగ్రహం కనిపించింది. దాని పక్కనే గణపతి విగ్రహాన్ని కూర్చోబెట్టే పీఠం దొరికింది. దేవుడి విగ్రహాలు బయటపడటంతో పొలంలో పనిచేస్తున్న వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గణపతి విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఈ వార్త నారాయణఖేడ్ మండలమంతా వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనాలు గణపతి విగ్రహాలను చూడడానికి తరలి వస్తున్నారు.

Oldest Ganesh Idol Found In Sangareddy
Oldest Ganesh Idol Found In Sangareddy

అత్యంత నైపుణ్యంతో చెక్కిన రాతి గణపతి విగ్రహం, పీఠం, దాని మీద ఉన్న మూషికం గురించి జనాలు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. విగ్రహం బయటపడిన ప్రాంతంలోనే గుడి కట్టాలని తుర్కపల్లి గ్రామస్థులు కోరుతున్నారు. పురావస్తుశాఖ ఈ విగ్రహాలపై పరిశోధనలు చేసి ఏ కాలానికి చెందిన విగ్రహాలో చెప్పాలని స్థానికులు కోరుతున్నారు. మరిన్ని తవ్వకాలు జరిపితే ఇంకొన్ని విగ్రహాలు బయటపడొచ్చని అంచనా వేస్తున్నారు. దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తే తుర్కపల్లి మరో ప్రఖ్యాత గణపతి సన్నిధానం అవుతుందంటున్నారు ఆ గ్రామస్థులు.