అయిపోయిందనుకుంటున్న టైమ్ లో మళ్లీ మొదలైన కరోనా భయం. ఆందోళనకు గురిచేస్తున్న కొత్త వేరియంట్.

కరోనా. ఈ పేరు వింటేనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ హడల్. ఎందుకంటే గత రెండేళ్లుగా ఈ మహమ్మరి కారణంగా జరిగిన ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం అలాంటిది మరి. ప్రపంచ పురోగతిని ఏడాది పాటు వెనక్కి నెట్టిందీ వైరస్. ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తుందని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా మరో కొత్త వేరియంట్ వదలా బొమ్మాలీ అన్నట్లుగా అటాక్ మొదలుపెట్టింది. అదే ఒమ్రికాన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఈ వేరియంట్ ను పరిశీలించి ఒమ్రికాన్ గా నామకరణం చేసింది. డెల్టా వేరియంట్ కన్నా కూడా ఇది భయంకరమైనదని చెబుతున్నారు. పలు మ్యూటెంట్ల సమ్మేళనంగా ఉన్న ఈ వేరియంట్ భయంకరంగానే కనబడుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ జాబితాలో దీన్ని చేర్చింది. ఐతే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం కూడా ఉందంటోంది.

మళ్లీ మొదలైన భయం

సౌత్ ఆఫ్రికాలో పుట్టిందంటున్న ఈ వేరియంట్ నిజానికి దాని పక్కనే ఉన్న బొత్సువానాలో పురుడు పోసుకుంది. ఆ తర్వాత క్రమంగా సౌత్ ఆఫ్రికాకు వ్యాపించింది. దీని విస్తరణ వేగం ఆందోళన కలిగించేలా ఉంది. కచ్చితంగా వేరియంట్ కారణంగా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందనే డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. వైరస్ కు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దీని ప్రభావం ఏమీ ఉండదని అంతా భావించారు. గత కొన్ని రోజులుగా పలు వేరియంట్లు కనిపించినప్పటికీ వాటి ప్రభావం పెద్దగా లేకుండే. తాజాగా భయపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ మాత్రం అత్యంత ప్రమాదకరమైందిగా చెబుతున్నారు. దీంతో మళ్లీ పరిస్థితులు అన్ని మారిపోయేలా కనిపిస్తున్నాయి.  ఇప్పటికే యూరోప్ దేశాల్లో కరోనా ఎఫెక్ట్ కారణంగా పలుచోట్ల లాక్ డౌన్ లు పెట్టారు. ఇక సౌత్ ఆఫ్రికా నుంచి విమానాల రాకపోకలను కొన్ని దేశాలు నిలిపివేశాయి. జర్మనీలో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. దీని ప్రభావం అన్ని యూరోప్ దేశాలపై ఉంటుందని భావిస్తున్నారు. ఇజ్రాయెల్, బ్రెజిల్ లాంటి దేశాలకు కూడా వేరియంట్ విస్తరించింది. దీంతో మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. అమెరికా అయితే సౌత్ ఆఫ్రికాతో పాటు 7 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది.

ఆర్థిక వ్యవస్థకు గండమే

కరోనా కారణంగా జరిగిన ప్రాణనష్టం ఎంత ఉందో…ఈ మహమ్మరి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతోనూ దాదాపు అంతా మంది చనిపోయారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇది చూపిన ప్రభావం అంతలా ఉంది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారాలు దెబ్బతిని సూసైడ్ చేసుకున్న వారు ఉన్నారు. చాలా దేశాల ఆర్థిక పరిస్థితి కూడా తారుమారు అయ్యింది. ఇప్పుడిప్పుడే మళ్లీ వ్యాపారాలు గాడిన పడుతున్నాయనుకుంటే…మరోసారి ఆర్థిక వ్యవస్థకు గండం మొదలైంది. విమానయం, హాస్పిటాలిటీ, ట్రావెల్ రంగాల్లో వ్యాపారాలకు ఎఫెక్ట్ మొదలైంది. అన్ని దేశాల్లో స్టాక్ మార్కెట్లు పతనం దిశగా సాగుతున్నాయి. దీంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు.

వ్యాక్సిన్ పూర్తి రక్షణ కాదు

కరోనా నుంచి రక్షణ కోసం చాలా రకాల వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయి. రెండు డోసుల వ్యాక్సినేషన్ తర్వాత కరోనా రాదన్న ధీమాలో ఎక్కువ మంది ఉన్నారు. కానీ పరిస్థితులు రివర్స్ గా ఉన్నాయి. వ్యాక్సినేషన్ పూర్తైన తర్వాత కూడా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. పైగా కొత్తగా పుట్టుకొచ్చిన వేరియంట్ యాంటీబాడీల రక్షణను కాదని వ్యాప్తి చెందుతోంది. దీంతో డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులు అయితే అలర్ట్ గా ఉండాలంటున్నారు. దీని బారి నుంచి తప్పించుకోవాలంటే కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

ఇండియా అలర్ట్

కొత్త వేరియంట్ కలకలం నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రధాని మోడీ అత్యవసరంగా ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్  గౌబా, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వీకే పాల్ మీటింగ్ పాల్గొన్నారు. మన దేశంలోకి కొత్త వేరియంట్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ఒమ్రికాన్ ఎఫెక్ట్ పై కేంద్ర ఆరోగ్య శాఖ, బయో టెక్నాలజీ విభాగం అధికారులు సమీక్ష చేస్తున్నారు.