రేప్ కేసులో బెయిల్‎పై వచ్చి మళ్లీ అదే యువతిపై రేప్

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రేప్ కేసులో జైలుకెళ్లిన యువకుడు.. బెయిల్‎పై వచ్చి మళ్లీ అదే యువతిని రేప్ చేశాడు. జబల్‌పూర్ జిల్లాకు వివేక్ పటేల్ 2020లో ఓ మైనర్‎ను రేప్ చేశాడు. ఆ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దాదాపు ఏడాది జైలు జీవితం గడిపిన తర్వాత నిందితుడు 2021లో బెయిల్ పై విడుదలయ్యాడు. దాదాపు నెల రోజుల కింద వివేక్ తన స్నేహితుడితో కలిసి అప్పటి మైనర్, ఇప్పటి యువతి ఇంటికి వెళ్లాడు. మెడ మీద కత్తి పెట్టి మరోసారి యువతిని రేప్ చేశాడు. ఈ ఘటనను మొత్తం నిందితుడి స్నేహితుడు వీడియో తీశాడు. అప్పటి నుంచి ఆ వీడియోను చూపించి తనపై గతంలో పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. దాంతో విసిగిపోయిన బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు, అతని స్నేహితుడి కోసం గాలింపు చేపట్టారు.