భారత్‌కు నిరాశ.. రెండో స్థానంలోకి పాకిస్థాన్..!

Pakistan Team Crossed Team India In World Test Rankings
Pakistan Team Crossed Team India In World Test Rankings

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో భారత్ ని వెనక్కి నెట్టింది పాకిస్తాన్. బంగ్లాదేశ్‌ తో జరిగిన నిన్నటి టెస్ట్ మ్యాచ్ లో సునాయాస విజయం సాధించిన పాకిస్తాన్.. పాయింట్ల పట్టికలో భారత్ ని అధిగమించింది. బంగ్లాదేశ్‌తో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించటంతో పాకిస్థాన్ ఖాతాలో 12 పాయింట్లు చేరాయి. దీంతో పాకిస్తాన్ జట్టు మొత్తం పాయింట్ల సంఖ్య 24కి చేరింది. బంగ్లాదేశ్‌పై టెస్టు గెలిచిన తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ రెండో స్థానానికి చేరుకుంది. అయితే పాకిస్థాన్ కంటే భారత్‌కు ఎక్కువ పాయింట్లు ఉన్నా విన్నింగ్ పర్సంటేజీలో మాత్రం వెనుకబడి ఉండటంతో భారత్ మూడో స్థానానికి పరిమితమైంది.మరోవైపు కాన్పూర్ టెస్టులో భారత్‌ను విజయం ఊరించి ఉసూరుమనిపించింది. ఈ టెస్టును భారత్ గెలిచి ఉంటే భారత్ ఖాతాలో 12 పాయింట్లు చేరేవి. విన్నింగ్ పర్సంటేజీ కూడా పెరిగేది. కానీ డ్రా కావడంతో భారత్ ఖాతాలో 4 పాయింట్లు మాత్రమే చేరాయి. అటు విజయాల శాతం కూడా తగ్గిపోయింది. టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో శ్రీలంక అగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ 5వ స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ జట్టు 6వ స్థానంలో ఉంది.