ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానే.. పల్లా గెలుపు ఖాయం

గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయం అయిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సబ్భాండ వర్గాలు, సకల సంఘాలు పల్లా రాజేశ్వర్ రెడ్డికే మద్దతు పలుకుతున్నారన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో నల్గొండ-‌ఖమ్మం-వరంగల్ TRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి గెలుపును కాంక్షిస్తూ నల్గొండ జిల్లాలో పద్మనాయక వెలమ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ … ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానే అని అన్నారు. ప్రతిపక్షాలు కనుచూపు మేరలో కూడా లేవని, ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు అవుతాయని చెప్పారు.

సీఎం కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వ్యవసాయం పండుగల మారిందని, కాళేశ్వరం గోదావరి జలాలు తెలంగాణ ను ససస్యశ్యామలం చేశాయన్నారు. రైతు బంధు, భీమా ,24 గంటల ఉచిత కరెంట్ పథకాలు వ్యవసాయ రంగం ముఖ చిత్రాన్ని మార్చి, రైతును రాజుని చేశాయన్నారు.

ప్రతిపక్షాలు జగుప్సాకరంగా వ్యవహరిస్తున్నాయని, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎర్రబెల్లి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నాడన్నారు. అసలు బీజేపీ పార్టీ అంటేనే మోసం, ధగా, దౌర్జన్యం అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు . రైల్వే స్టేషన్‌లలో చాయ్ అమ్మానని చెపుతున్న ప్రధాని మోడీ ఇప్పుడు రైళ్లను అమ్ముతున్నాడన్నారు. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ ప్రైవేటు కు ధారాదత్తం చేస్తూ దేశ ప్రజలను దోచుకుంటున్నాడని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు.

విభజన చట్టంలో తెలంగాణ కు హామీ ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఉక్కు ఫ్యాక్టరీ లను మంజూరు చేయకుండా మోసం చేశాడని అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలకు దమ్ము ,ధైర్యం లేదన్నారు. తెలంగాణ కు కేంద్రం నుంచి రావాల్సిన పథకాలను, ప్రయోజనాలను అడిగే తెలివి లేదు కానీ, ఇక్కడ మాత్రం గొంతులు చించుకుంటున్నరని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నాయకులకు ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి.