స్పృహ కోల్పోయిన పైలట్.. ఫ్లైట్‎ని ల్యాండ్ చేసిన ప్రయాణికుడు

విమాన ప్రయాణమంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి భయం కూడా ఉంటుంది. అయితే ఫ్లైట్‎లో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్ స్పృహ కోల్పోయి పడిపోతే, కళ్ల ముందే విమానం కూలిపోతుంటే, మరికొన్ని క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయంటే.. అనుభవించిన వారికే తెలుస్తుంది ఆ క్షణం వారు పడే బాధ. అలాంటి సంఘటనే అమెరికాలో వెలుగుచూసింది.

ఫ్లోరిడాకు చెందిన డారెన్ హారిసన్ (39) అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి సింగిల్ ఇంజిన్ విమానంలో ఫిషింగ్ ట్రిప్ నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే ఆ విమానం ఎగిరిన కాసేపటికి సముద్రం మీదుగా వెళ్తున్న సమయంలో తనకు ఏదోలా ఉందని పైలట్ చెప్పాడు. అది విన్న హారిసన్ వెంటనే ఏం చేయాలో చెప్పండి అని పైలట్ ని అడిగాడు. కానీ, అప్పటికే పైలట్ స్పృహ కోల్పోయాడు. ఆ సమయంలో తాను భయపడితే చావు తప్పదు అని గ్రహించిన హారిసన్ వెంటనే తెలివిని ప్రదర్శించాడు. పైలట్ తలకున్న హెడ్ సెట్ తీసుకొని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‎తో కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు చెప్పినట్లుగా చేసి.. విమానాన్ని సేఫ్‎గా ల్యాండ్ చేయగలిగాడు.

ఈ ఘటనపై హారిసన్ స్పందిస్తూ.. నేను ఏమాత్రం ఆలస్యం చేసినా చావు తప్పదని నాకు అర్థమైంది. నాకు ఏడునెలల గర్భవతి అయిన నా భార్య గుర్తుకు వచ్చింది. వెంటనే ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కొన్ని క్షణాలు కళ్లు మూసుకొని ప్రశాంతంగా ఉన్నాను. ఆ క్షణం జీవనమరణ సమస్య అని తెలిసిపోయింది. అందుకే ముందుకు అడుగువేశాను. విమానం ల్యాండ్ అయిన వెంటనే.. నా భార్యకు ఫోన్ చేశాను’ అని హారిసన్ తెలిపాడు.