నకిలీ విత్తనాల విక్రయదారులపై పీడీ యాక్ట్‌.. డీజీపీ మహేందర్ రెడ్డి - TNews Telugu

నకిలీ విత్తనాల విక్రయదారులపై పీడీ యాక్ట్‌.. డీజీపీ మహేందర్ రెడ్డిDGP Mahender Reddy clarified that all vehicles entering Telangana should have e-pass

నకిలీ విత్తనాల విక్రయదారులను గుర్తించి వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టే అంశంపై శనివారం పోలీసు ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల విక్రయదారులను ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు. నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసుశాఖ, వ్యవసాయశాఖ సంయుక్తంగా కృషి చేయాలని చెప్పారు.

రాష్ట్రంలో గత ఐదేండ్లలో నకిలీ విత్తనాలు విక్రయించి అరెస్టయినవారి వివరాలు, నష్టపోయిన రైతులు, పంట నష్టం, విక్రయదారుల సమాచారాన్ని సేకరించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.

నకిలీ విత్తనాల విక్రయదారులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసు శాఖకు అందించాలని విత్తన కంపెనీలు, డీలర్లను కోరాలన్నారు. ఏవి నకిలీ విత్తనాలు, ఏవి సరైన విత్తనాలు, వాటిని గుర్తించే విధానంపై పోలీసు అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని చెప్పారు.

గతేడాది రాష్ట్రంలో 104 మంది నకిలీ విత్తన విక్రయదారులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాల్లో అధికంగా నకిలీవి ఉంటాయని, రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించడంతో ఇతర రాష్ట్రాల్లో తయారుచేసి అక్రమంగా ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు.