ప్రజలపై పెట్రో భారం.. ట్యాక్సుల రూపంలో కేంద్రానికి రూ.94 వేల కోట్ల రాబడి

సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రో ధరలు.. కేంద్రానికి మాత్రం భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై విధించిన ఎక్సైజ్ ట్యాక్సులతో 2021 ఏప్రిల్ నుంచి జూన్ వరకు కేంద్రానికి సుమారు 94,181 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వివరించారు. పెట్రోల్, డీజిల్‌పై విధించే సెస్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నకు చౌదరి సమాధానమిచ్చారు.

ప్రస్తుతం బ్రాండెడ్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ .32.90, డీజిల్‌కు 31.80. ఉందని మరో పశ్నకు పెట్రోలియం శాఖ మంత్రి రమేశ్వర్ చెప్పారు.  2020-21 ఆర్థిక సంవత్సరానికి పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకంలో కేంద్రానికి రూ .3.45 లక్షల కోట్లు సమకూరాయన్నారు. ఆ మొత్తం 2019-20లో రూ .1.98 లక్షల కోట్లు, 2018-19లో రూ .1.78 లక్షల కోట్లుగా ఉందని సభలో మంత్రి వివరించారు.