ఖమ్మం జిల్లాలో చైనా ట్యాగ్‌తో పావురం కలకలం

Pigeon with China tag on legs found in Khammam district

దేశంలో చైనా భాషలో ఉన్న ట్యాగ్​తో కూడిన పావురాలు కనిపించడం కలకలం రేపుతున్నాయి. ఇటీవలే ఒడిషా, ఏపీలోని ప్రకాశం జిల్లాలో ​ ఈ పావురాలు ఆందోళన రేకెత్తించాయి. బుధవారం రోజున రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో కూడా ట్యాగ్ తో ఉన్న పావురం టెన్షన్ కలిగించింది. జిల్లాలోని తిరుమలాయ పాలెం మండలం దమ్మయిగుడెంలో రైతుకు ఈ పావురం కనిపించింది. దమ్మాయిగూడెంలో కనిపించిన ఈ కపోతాన్ని స్థానిక రైతులు పోలీసులకు అందించగా.. పోలీసులు అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పారు.

గ్రామ సమీపంలోని కల్లంలో రైతులు వరి ధాన్యం ఆరబోశారు. ఆ సమయంలో పావురం రాగా.. దాని కాలుకు చైనా భాషలో ముద్రించిన ఓ ట్యాగ్‌ ఉన్నట్లు ఓ రైతు గుర్తించాడు. వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఎస్సై భవానీ దాన్ని పరిశీలించి అటవీ శాఖ డివిజనల్‌ అధికారి సురేశ్‌కు అప్పగించారు. పావురానికి చికిత్స అందించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారని ఎస్సై చెప్పారు. ఒడిశా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ సోమ, మంగళవారం చైనా భాష ట్యాగ్‌తో ఉన్న పావురాలు కనిపించడం గమనార్హం.