నేతాజీకి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

PM Modi, President Kovind pay tribute to Netaji Subhas Chandra Bose on his birth anniversary

స్వాతంత్య్ర సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశంలోని ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించుకుంటున్న ‘పరాక్రమ్ దివస్’ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ. బోస్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఓ ఫొటోను ట్విట్టర్​లో మోదీ షేర్ చేశారు. దేశానికి నేతాజీ చేసిన సేవ చిరస్మరణనీయమని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు ఆయన పట్ల గర్విస్తున్నారని చెప్పారు.

‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారత్ నివాళులు అర్పిస్తోంది. స్వేచ్ఛాయుత భారతదేశం అనే భావనను సాకారం చేసేందుకు ఆయన నిబద్ధతతో వేసిన అడుగుల వల్ల దేశానికి స్ఫూర్తిగా మారారు’ అంటూ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

నేతాజీ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకున్న బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఈ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా బోస్​కు నివాళి అర్పించేందుకు వీలు కల్పించేలా హాలిడే ఇవ్వాలని సూచించారు. దేశ్​నాయక్ దివస్​ను సముచితంగా నిర్వహించాలని కేంద్రానికి పిలుపునిచ్చారు.