బర్మా ఖర్మ మారేదెన్నడు?

బర్మా ఖర్మ మారేదెన్నడు?

రాత్రికి రాత్రే మయన్మార్ ప్రపంచం తలకిందులైంది. ప్రజాస్వామ్యాన్ని సైన్యం హస్తగతం చేసుకుంది. ఆంగ్ సాన్‌ సూకీ మరోసారి గృహనిర్బంధంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడా దేశంలో సామాన్యులు ఇండ్లు విడిచి బయటకొచ్చే పరిస్థితి లేదు. మరోపక్క మిలటరీ కుట్రపై ఐరాస మండిపడింది. ఆర్మీ వెనక్కి తగ్గకుంటే సీరియస్ యాక్షన్ తప్పదని అమెరికా హెచ్చరించింది. ఇంతకూ బర్మాకు పట్టిన ఖర్మ తీరేదెన్నడు?

మరోసారి సైన్యం దుర్బుద్ధి

మయన్మార్‌లో మరోసారి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న సాకుతో సైన్యం మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఎమర్జెన్సీ విధించి.. అధికార నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ(ఎన్ఎల్డీ) నేత ఆంగ్‌ సాన్‌ సూకీ, అధ్యక్షుడు విన్‌ మింట్‌ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలందరినీ సైన్యం నిర్బంధించింది. రాజధాని నేపిడా సహా దేశంలోని వివిధ నగరాల్లో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను ఆపేసింది. టీవీ ప్రసారాలపై ఆంక్షలు విధించింది. ఏడాది పాటు ఎమర్జెన్సీ కొనసాగుతుందని.. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది. సైన్యాధిపతి మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌ సర్వాధికారాలు గుప్పిట పట్టాడు. దీనిపై అంతర్జాతీయ సమాజం మండిపడింది. ఐక్యరాజ్య సమితి, అమెరికా ఖండించాయి. మిలిటరీ వెనక్కి తగ్గకుంటే ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్లొద్దని బైడెన్‌ సైన్యానికి సూచించారు. మయన్మార్‌ సైన్యం చర్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా బైడెన్‌ వర్ణించారు.

విజయం సాధించినా..

మయన్మార్‌ పార్లమెంట్‌కు గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్‌ సూకీకి చెందిన ఎన్ఎల్డీ  476 స్థానాలకు గానూ 396 స్థానాలు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు చట్టసభ్యులు నేపిడాలో సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు. అయితే ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ఆ దేశ సైన్యం ఆంగ్‌సాన్‌ సూకీ సహా ఇతర కీలక నేతలను అదుపులోకి తీసుకొని గృహనిర్బంధం విధించింది.

ప్రజల ఆందోళన

ప్రస్తుతం అక్కడ ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించినా.. వాటిపై సవాలక్ష ఆంక్షలు. ఫోన్లు పనిచేయడం లేదు.  ప్రభుత్వ టీవీ చానల్ తోపాటు దేశీయ, అంతర్జాతీయ ఏ టీవీ చానలూ పనిచేయడంలేదు. జనం నిత్యావసర వస్తువులను కొనేందుకు కష్టాలు పడుతున్నారు. ఏటీఎంల ముందు క్యూలు పెరిగిపోయాయి. ఏం జరుగుతుందోననే ఆందోళనతో చాలామంది జనం ఇంటికి పరిమితమయ్యారు. అసలే ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న దేశంలో మరో కష్టకాలం దాపురించింది. ధరలు పెరిగిపోతాయని ప్రజలు భయపడుతున్నారు. పైగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో సైనిక చర్య మంచిది కాదని జనం మొత్తుకుంటున్నారు.

స్వాతంత్రం నుంచి నిర్బంధం వరకు..

స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంత కాలం మాత్రమే బర్మాలో ప్రజాస్వామ్యం కనిపించింది. చాలాకాలం మిలటరీ గుప్పిట్లోనే బర్మా నలిగింది.

1948, జనవరి 4న బర్మా బ్రిటీష్‌ పాలన నుంచి విముక్తి పొందింది.

1962లో మిలటరీ తిరుగుబాటు చేసి పాలనా పగ్గాలు చేజిక్కించుకుంది.

1988లో ఆంగ్‌సాన్‌ సూకీ ప్రజాస్వామ్య పోరాటం చేసింది. దాంతో మిలటరీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. నిరసన కారులపై మిలటరీ కాల్పులు జరిపింది. వందలాది మందిని పొట్టనపెట్టుకుంది.

1989 జూలైలో సూకీ హౌస్‌ అరెస్టు అయింది.

1990, మే27న జరిగిన ఎన్నికల్లో సూకీ పార్టీ ఎన్ఎల్డీ బంపర్‌ మెజార్టీ సాధించింది. కానీ పాలనా పగ్గాలు అందించేందుకు సైన్యం నిరాకరించింది.

1991, అక్టోబర్‌లో సూకీకి శాంతియుత పోరాటానికి నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది.

2010లో జరిగిన ఎన్నికల్లో సైన్యం అనుకూల పార్టీకి అత్యధిక సీట్లు దక్కాయి.

2010, నవంబర్‌ 13న హౌస్‌ అరెస్టు నుంచి సూకీ విడుదలయ్యారు.

2012లో పార్లమెంట్‌ బైఎలక్షన్‌లో సూకీ విజయం సాధించారు.

2015, నవంబర్‌ 8న జరిగిన ఎన్నికల్లో సూకీ పార్టీ ఘన విజయం సాధించింది. కీలక పదవులను సైన్యం తమ ఆధీనంలో ఉంచుకొని సూకీకి స్టేట్‌ కౌన్సిలర్‌ పదవి ఇచ్చింది.

2017, ఆగస్టు 25న రోహింగ్యాలపై మిలటరీ విరుచుకుపడింది. ఆ దెబ్బకు వేలాదిమంది బంగ్లాదేశ్‌కు పారిపోయారు.

2020, నవంబర్‌ 8 ఎన్నికల్లో సూకీ పార్టీకి మరోసారి మెజార్టీ దక్కింది.

2021, జనవరి 29న జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపణలను బర్మా ఎన్నికల కమీషన్‌ తోసిపుచ్చింది. ఇందుకు సరైన ఆధారాల్లేవని చెప్పింది.

2021, ఫిబ్రవరి 1న దేశాన్ని ఒక సంవత్సరం పాటు ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు మిలటరీ ప్రకటించింది.