సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.కోటి విరాళమిచ్చిన బాహుబలి

అందరినీ డార్లింగ్ అంటూ పిలిచే ప్రభాస్ బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నవన్నీ పాన్ ఇండియా మూవీలే. ప్రస్తుతం ఇప్పుడు ఆయన నాలుగు భారీ సినిమాలు చేస్తూ.. రెమ్యూరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నాడు. అయితే.. ఎవరికి ఏ ఆపద వచ్చినా తెలియగానే సాయం చేసే మంచి మనసున్న వ్యక్తిగా టాలీవుడ్ లో ప్రభాస్ కి పేరుంది. కరోనా సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున విరాళమిచ్చిన విషయం తెలిసిందే. పీఎం రిలీఫ్ ఫండ్ కి సైతం.. రూ.3 కోట్లు ఇచ్చాడు. అయితే.. ప్రస్తుత ఏపీ పరిస్థితుల నేపథ్యంలో హీరో ప్రభాస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ. కోటి విరాళం అందించాడు.


ఏపీలో ఈ మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఎంతోమంది ఇల్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. జనజీవనం అస్తవస్త్యమైంది. అయితే.. వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. చిత్ర పరిశ్రమ కూడా తమ వంతు సాయం చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ రూ. 25 లక్షలు, రామ్ చరణ్ రూ.25 లక్షలు, చిరంజీవి రూ.25 లక్షలు, మహేశ్ బాబు రూ.25 లక్షలు, గీతా ఆర్ట్స్ తరపున అల్లు అరవింద్‌ రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఇప్పుడు తాజాగా ప్రభాస్ రూ.కోటి సీఎంఆర్ఎఫ్ కి ఫండ్ ఇచ్చాడు.