దిగొచ్చిన మోడీ సర్కార్.. సాగుచట్టాలు రద్దు

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని విరమించి ఇంటికి వెళ్లాలని ప్రధాని మోడీ రైతులను కోరారు. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాలపై ప్రకటన చేస్తామని.. రైతులందరికీ క్షమాపణ చెప్తున్నా అన్నారు మోడీ.


ప్రధాని చెప్పింది ఇదే..
2014లో నేను తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మా ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం కల్పించింది. మనదేశంలో 80శాతం సన్నకారు రైతులే. 10కోట్ల మందికి పైగా రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంది. అదే వారికి జీవనోపాధి. అన్నదాతల కష్టాలను దగ్గరుండి చూశాను. అందుకే వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చాం. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచాం. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచాం.

రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేయబోతున్నాం. ఫసల్‌ బీమా యోజన్‌ను మరింత బలోపేతం చేస్తాం. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలను రైతులు ఆమోదించలేదు. వారి నుంచి వ్యతిరేకత వచ్చింది. అందుకే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ పార్లమెంట్ సమావేశంలోనే సాగు చట్టాల రద్దును ప్రకటిస్తామన్నారు.