
మా ఎన్నికల రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య ఆరోపణలు, కవ్వింపు చర్యలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే మంచు విష్ణు ప్యానెల్ సభ్యుడైన పృథ్వీ రాజ్ ఫోన్ కాల్ ఇప్పుడు అటు ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కాకపోతే పరిపాలించే అర్హత మాత్రం ఉండదు అంటూ పృథ్వీ రాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రకాష్ రాజ్ ని ఉద్ధేశించి అన్న ఆయన మాటలు పరిశ్రమలో, మా ఎన్నికల్లో హీట్ పెంచాయి.
ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు చెందిన ఓ సభ్యుడికి ఫోన్ చేసిన పృథ్వీ రాజ్ ఫోన్ కాల్ లో పలు సంచలన విషయాలు మాట్లాడారు. నాకు వైజాగ్ తో మంచి అనుబంధం ఉంది. నా రాజకీయ ప్రస్థానం మొదలైందే అక్కడ. కానీ.. మీరు ఈ మధ్య ప్రకాష్ రాజ్ ని సన్మానించారు. అది నాకు నచ్చలేదు. ప్రకాష్ రాజ్ కి ఎలా మద్దతిస్తారయ్యా?ఆయనకు క్రమశిక్షణ లేదని ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ ఆయనను రెండుసార్లు సస్పెండ్ చేసింది. నేను ఓ కన్నడ సినిమాలో నటిస్తుండగా.. ఇక్కడ కన్నడ వాళ్లు మాత్రమే నటించాలి.. అని ఆయన నాపై కేకలు వేశాడు. మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అంటూ ప్రశ్నించాడు పృథ్వీరాజ్. మీకు ఆయన ఎందుకు అంతగా నచ్చాడు? పరాయిభాష వాళ్లపై మీకు అంత ఇష్టమేందుకు? ఏది ఏమైనా నా స్లోగన్ ఒక్కటే ‘తెలుగువాడిని గెలిపిద్దాం.. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం’’ అని పృథ్వీరాజ్ ఫోన్ కాల్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.