కత్రినాపై రాజస్థాన్ మంత్రి కంత్రీ కామెంట్స్

Rajasthan Minister Rajendra Singh comments on Bollywood actress Katrina Kaif

బాలీవుడ్ హీరోయిన్ల‌తో రోడ్ల‌ను పోల్చ‌డం కొత్తేం కాదు. 2005లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్.. బీహార్ రోడ్ల‌ను హేమ‌మాలిని చెంప‌ల్లా త‌యారు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. 2019లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ న్యాయ శాఖ మంత్రి పీసీ శ‌ర్మ.. డ్రీమ్ గ‌ర్ల్ స్టార్ నుష్ర‌త్ చెంప‌ల్లా రోడ్ల‌ను అభివృద్ధి చేస్తామ‌న్నారు.

కాలం మారినా రోడ్లను హీరోయిన్ బుగ్గలతో పోల్చడం ఆగలేదు. తాజాగా రాజ‌స్థాన్ ప్ర‌భుత్వంలో ఇటీవ‌లే కొత్త‌గా మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన రాజేంద్ర సింగ్.. మంగ‌ళ‌వారం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా ఉద‌య్‌పూర్వ‌తిలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో స్థానికుల‌తో మంత్రి స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సమయంలో స్థానికులు వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో అధ్వాన్న‌మైన‌ రోడ్ల ప‌రిస్థితిని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ల మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి రాజేంద్ర సింగ్.. అక్క‌డే ఉన్న ప‌బ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్ మెంట్ చీఫ్ ఇంజినీర్ వైపు చూస్తూ.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రోడ్లను బాలీవుడ్ న‌టి క‌త్రినా కైఫ్ చెంప‌ల్లా మెరిసిపోయేలా నిర్మించాల‌ని సూచించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.