కమల్ హాసన్ కు రజనీకాంత్ ఫోన్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా

కరోనా పాజిటివ్ సోకి దవాఖానాలో చికిత్స పొందుతున్న తమిళ నటుడు కమల్ హాసన్ కి రజనీకాంత్ ఫోన్ చేశారు. బిజినెస్ ట్రిప్ లో భాగంగా యూఎస్ వెళ్లిన కమల్ అక్కడి నుంచి వచ్చాక అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షలు చేయించుకోగా కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. వెంటనే ఓ ప్రైవేట్ దవాఖానాలో అడ్మిట్ అయ్యారు. ప్రత్యేక వైద్యుల బృందం కమల్ కి వైద్యం అందిస్తున్నారు.


కమల్ హాసన్ కొవిడ్ బారిన పడ్డారని తెలుసుకున్న రజనీకాంత్ ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కమల్ త్వరలోనే ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకున్నట్టు తెలిపారు. డైరెక్టర్ బాలచందర్ శిష్యులైన రజనీ కాంత్, కమల్ హాసన్ పానిండియా స్టార్లుగా ఎదిగారు. రజనీకాంత్ తో పాటు ప్రముఖ నటులు ప్రభు, శరత్ కుమార్, విష్ణు, విశాల్, శివ కార్తికేయన్, ఎస్పీ ముత్తురామన్, లోకేష్ కనగరాజ్, ఫహద్ ఫసిల్, అట్లీ, ఇసారి గణేష్, విక్రమ్ ప్రభు తదితరులు కమల్ కోలుకోవాలని ఆకాంక్షించారు.