బియ్యం ఇస్తాం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?

rice-grain

తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫ్ సీఐకి బియ్యాన్ని (సీఎంఆర్) అప్పగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టిస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన చేతకానితనాన్ని తెలంగాణ ప్రభుత్వ వైఫల్యంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది. ఇది చాలా బాధాకం.. విచారకరమన్నారు. సోమవారం నాడు పౌరసరఫరాల భవన్లోని తన కార్యాలయం నుంచి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఇస్తామని చెప్పిన బియ్యాన్ని ఇ్వలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంట్ లో చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారు.

బియ్యం ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? బియ్యం నిల్వకు స్టోరేజ్ స్పేస్, వ్యాగన్లు కల్పించడంలో కేంద్రం (ఎఫ్ సీఐ) పూర్తిగా విఫలమైంది. ఒకవైపు ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లింగ్ నిలిపివేస్తుంది. మరోవైపు బియ్యం నిల్వలకు అవసరమైన గోదాములను ఇవ్వడం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తనిఖీ (ఫిజికల్ వెరిఫికేషన్) చేస్తున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ దాని పేరుతో కేంద్రం సమస్యలు సృస్టిస్తోంది. ఒక్క జిల్లాలోని రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహిస్తే రాష్ట్రం మొత్తం మిల్లింగ్ నిలిపివేయడంలో అర్థమేమిటి. ఫిజికల్ వెరిఫికేషన్లో ఒక నెలలో 23 రోజులు మరో నెలలో 16 రోజులు మిల్లింగ్ నిలిచి పోయింది. దీనికి తోడు డిమాండ్ మేరకు స్టోరేజ్ స్పేస్ కల్పించకపోవడం వల్ల రాష్ట్రంలో రైస్ మిల్లుల్లో, గోదాముల్లో ఎక్కడికక్కడ ధాన్యం నిల్వలు పేరుకపోయాయి. బియ్యం నిల్వలకు గోదాములు అడిగితే జెమ్ పోర్టల్ లో నమోదు చేసుకుంటేనే ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు.

2018-19లో రాష్ట్రంలో 37 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు 13 నెలల గడువు ఇచ్చింది. 2019-20లో 64 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే 12 నెలల గడువు మాత్రమే ఇచ్చింది. (73శాతం) కొనుగోళ్లు పెరగడం, కరోనా, లా డౌన్, హమాలీల కొరత వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ విషయాలను పలు సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా.. గడువు పొడిగించలేదు. దీనివల్ల 2019-20 యాసంగి సీజన్కు సంబంధించి దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం రాష్ట్రం వద్దే మిగిలిపోయాయి. గత ఏడాది (2020-21) యాసంగికి సంబంధించి ఎఫెసీఐ తీసుకోవడానికి అంగీకరించిన 56.63 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 28.98 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పగించడం జరిగింది. ఎఫెసిఐ నుంచి ఆశించిన సహకారం లేకపోవడం వల్లే బియ్యం అప్పగింతలో ఆలస్యం జరుగుతోంది.

mareddy srinivas

గోదాముల్లో బియ్యం నిల్వలకు స్థలాలు లేకపోవడంతో సోమవారం నాడు రాష్ట్రంలో 11 జిల్లాల్లో 720 లారీలు బియ్యంతో ఎఫ్ సిఐ గోదాంల ముందు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి తరచూ ఎదురవుతోంది. గత ఏడాది నవంబర్ నాటికి 1476 ర్యాక్ ల ద్వారా బియ్యాన్ని తరలించగా.. ఈ ఏడాది నవంబర్ వరకు కేవలం 1096 ర్యాక్ లను మాత్రమే ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును పెంచవలసిన కేంద్రం.. దాన్ని కుదించడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు.

ఒక ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల స్టోరేజ్ ఛార్జీలు భరిస్తే అందులో కేంద్రం కేవలం 2 నెలలకు మాత్రమే చెల్లిస్తోంది. తెలంగాణకు హమాలీ ఛార్జీలు ఒక్క క్వింటాళ్ కు కేంద్రం రూ.5.65 మాత్రమే చెల్లిస్తోంది. అదే పంజాబ్, హర్యాణాల్లో ఒక క్వింటాళ్ కు 24.25 చెల్లిస్తోంది. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ సంచులను కూడా సమకూర్చడంలేదు. గత ఏడాది యాసంగి సీజన్లో గన్నీ సంచులు కావాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి మోడి గారికి విజ్ఞప్తి చేసిన ఫలితం లేకుండా పోయింది.

రాజ్యగం ప్రకారం ధాన్యం సేకరణ అనేది కేంద్ర ప్రభుత్వ కనీస బాధ్యత, ప్రజా పంపిణీ అవసరాల కోసం 1973లో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఈ బాధ్యతను కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న నిర్వహిస్తోంది. రాష్ట్రంలో రైతాంగ సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పౌర సరఫరాల సంస్థ కేంద్రం తరుపున రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా ధాన్యాన్ని సేకరిస్తుంది. అయితే సేకరణ వల్ల రాష్ట్రాల పై భారం పడుతుండటంతో దేశంలో తెలంగాణ మినహా ఏరాష్ట్రం కూడా ధాన్యం సేకరణకు ముందుకు రావడంలేదు. రైతాంగ సంక్షేమాన్ని కాంక్షించి ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలుకు అవసరమైన నిధులను ప్రతి సీజనకు ముందుగానే పౌరసరఫరాల సంస్థకు సమకూరుస్తున్నారని తెలిపారు.

పక్క రాష్ట్రంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం 1 లక్ష 33 వేల 4 వందల మెట్రిక్ టన్నులు మాత్రమే. తెలంగాణలో ఈ ఏడాది వానాకాలంలో ఇప్పటివరకు 6630 కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల మంది రైతుల నుంచి రూ. 6392 కోట్ల విలువ చేసే 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. గత ఏడాది వానాకాలంలో ఇదే సమయానికి 26. 96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఈ ఏడాది దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేశాం. రైతాంగానికి ఇబ్బంది కలుగుతుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశాం. ప్రతి రోజు లక్షకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు.