5జీ స్పెక్ట్రమ్‌ ధరను సగానికి తగ్గించాలి: సెల్యులార్‌ ఆపరేటర్స్‌

5g-network

5జీ టెలికాం సేవల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే వేలం ప్రక్రియలో 5జీ స్పెక్ట్రమ్‌ మూలధరను సగానికి పైగా తగ్గించాలని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (COAI) కోరింది. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

వచ్చే ఏడాది ఏప్రిల్‌-జూన్‌ లో స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించే అవకాశం ఉంది. స్పెక్ట్రమ్‌ మూల ధరను 50-60 శాతం మేర తగ్గించాలని ఓ టెలికాం కంపెనీ ప్రతినిధి కోరగా.. ఈ తగ్గింపు 60-70 శాతం మేర ఉండాలని మరో కంపెనీకి చెందిన ఉన్నతాధికారి కోరారు. అయితే వీటిపై  స్పందించడానికి కాయ్‌ నిరాకరించింది.

ఇదిలా ఉండగా.. 3,300- 3,600 మెగాహెర్జ్‌ బ్యాండ్‌లో ఒక మెగాహెర్జ్ కు స్పెక్ట్రం మూలధరను రూ.492 కోట్లుగా నిర్ణయించాలని ట్రాయ్‌ కేంద్రానికి సూచించింది. 20 మెగాహెర్జ్ లను ఒక బ్లాక్‌గా విక్రయించాలని చెప్పింది.

దేశవ్యాప్తంగా ఈ లెక్కన ఒక కంపెనీ 5జీ సేవలు అందించాలంటే రూ.9,840 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో ఏడు బ్యాండ్ల పరిధిలో 2,308.80 మెగాహెర్జ్ ల స్పెక్ట్రాన్ని కేంద్రం వేలానికి ఉంచగా.. రిజర్వ్‌ ధర రూ.4లక్షల కోట్లుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

700 మెగాహెర్జ్‌, 2,500 మెగాహెర్జ్ ల బ్యాండ్ల మూల ధర ఎక్కువగా ఉండడంతో టెలికం కంపెనీల నుంచి పెద్దగా స్పందన రాలేదు. మరోవైపు దేశంలో 5జీ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. తొలుత ఆరు నెలలుగా ఈ గడువు నిర్దేశించగా.. తాజాగా ఆ గడువును 2022 మే వరకు టెలికాం విభాగం పొడిగించింది.