వనమా రాఘవకు రిమాండ్ పొడిగింపు

Remand extension for Vanama Raghava

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగించారు.

ఫిబ్రవరి 4 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. రాఘవేందర్‌ రిమాండ్‌ గడువు నిన్నటితో ముగియడంతో పోలీసులు అతడిని వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. తాజా ఆదేశాలతో రాఘవేందర్‌ మరో 14 రోజులు జైలులోనే ఉండనున్నారు. నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమంటూ వనమా రాఘవేందర్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొన్న తర్వాత పాల్వంచ నుండి అదృశ్యమైన రాఘవేందర్ హైదరాబాద్, విశాఖ తదితర ప్రాంతాల్లో గడిపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ సమయంలో రాఘవేందర్ సిమ్ కార్డులను మార్చినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే రాఘవ ఉపయోగించిన సిమ్ కార్డులకు పోలీస్ శాఖ నుండి ఎవరెవరు సమాచారం ఇచ్చారనే విషయమై ఉన్నతాధికారులు విచారణను ప్రారంభించారు.