స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం గుప్పిట్లోకి వచ్చింది. ఏం కావాలన్నా ఫోన్లోనే, ఫోన్‌తోనే. అయితే ఫోన్‌తో ఆపరేటింగ్ చేయడానికి మనం కొన్ని యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని డౌన్లోడ్ చేసుకునే సమయంలో అవి ఫోన్ డాటా యాక్సెస్‌కు అనుమతి అడుగుతాయి. దాంతో మన ఫోన్ డాటా మొత్తం సదరు యాప్ చేతిలోకి వెళ్తుంది. దానివల్ల మన పర్సనల్ డాటా, ఫొటోలు, వీడియోలు బయటకు లీక్ అవుతాయి. ఈ డాటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే.. మన పరిస్థితి అంతే. ఫొటోలను, వీడియోలను అడ్డం పెట్టుకొని మనల్ని బెదిరిస్తుంటారు. అందుకే ప్లే స్టోర్‌లో ప్రమాదకరమైన మాల్వేర్ యాప్‌లను గుర్తించి గూగుల్ ఎప్పటికప్పుడు నిషేధం విధిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా మరో ఐదు యాప్‌లను గూగుల్ తొలగించింది. ఈ యాప్‌లు స్పైవేర్లుగా పనిచేస్తూ మొబైల్లోని ఇతర యాప్‌ల నుంచి డేటాను తస్కరించి మనల్ని ప్రమాదంలో పడేస్తున్నాయట. అందుకే ఈ ఐదు యాప్‌లు మీ మొబైల్లో ఉంటే వెంటనే అన్ ఇన్స్టాల్ చేయండి. అయితే ఆ ఐదు యాప్స్ ఏంటో చూసేద్దామా?
PIP Pic Camera Photo Editor: ఈ యాప్‌తో ఇమేజ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇందులోని మాల్వేర్ ఫేస్బుక్ లాగిన్ వివరాలను దొంగలిస్తోందట. దీనిని ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు సమాచారం. అందులో మీరు కూడా ఒకరైతే వెంటనే తీసేయండి.
Wild & Exotic Animal Wallpaper: ఈ యాప్ ద్వారా ఫోన్లో మనకు నచ్చిన వాల్ పేపర్ సెట్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో మాస్క్వెరేడింగ్ (masquerading) అనే యాడ్వేర్ ఉంటుంది. ఇది మొబైల్లోని ఇతర యాప్‌ల ఐకాన్‌ను, పేరును మారుస్తుంది. దానివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇక ఈ యాప్‌ను 5 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారట.
Zodi Horoscope – Fortune Finder: ఈ యాప్ ద్వారా రోజువారీ జాతకం చూసుకోవచ్చు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల స్మార్ట్‌ఫోన్‌లోకి ప్రవేశించిన మాల్వేర్ ఫేస్బుక్ ఖాతా వివరాలను దొంగిలిస్తుంది. దీన్ని కూడా 5 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారట.
PIP Camera 2022: కెమెరాను మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు ఈ యాప్‌ను వాడుతుంటారు. ఈ యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించగానే అందులోని మాల్వేర్ ద్వారా ఫేస్బుక్ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు చేరవేస్తోంది. ఈ యాప్‌ను 50 వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు సమాచారం.
Magnifier Flashlight: ఈ యాప్‌లో వీడియో, స్టాటిక్ బ్యానర్ యాడ్స్ ఎక్కువగా వస్తాయి. సైబర్ నేరగాళ్లు వీటి నుంచి యాడ్‌వేర్‌ను ఫోన్లోకి పంపి డేటాను సేకరిస్తున్నారు. దీనిని 10 వేల మందికిపైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.