బిర్యానీ కొంటే.. రెండు తులాల బంగారం ఫ్రీ.. ఈ ఆఫర్ హైదరాబాద్ లోనే..

బిజినెస్ సక్సెస్ ఫుల్ గా నడువాలంటే నిత్యం ఏదో ఒక ఆఫర్ ప్రకటిస్తూనే ఉండాలి. అది మార్కెట్ సూత్రం. అయితే.. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓ హైదరాబాదీ మాత్రం అద్భుతమైన ఆఫర్ ప్రకటించాడు. తన రెస్టారెంట్ లో బిర్యానీ తింటే.. రెండు తులాల బంగారం గెలుచుకోవచ్చు అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.


హైదరాబాద్ లోని మియాపూర్ లో హోటల్ రేణూ గ్రాండ్ అనే రెస్టారెంట్ నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. రూ.99 తో తమ రెస్టారెంట్ లో బిర్యానీ కొన్న వారికి ఓ లక్కీ కూపన్ ఇస్తున్నారు. బిర్యానీ కొన్న వారు ఆ కూపన్ నింపి అక్కడ ఏర్పాటు చేసిన డ్రా బాక్సులో వేయాలి. డ్రాలో గెలిచిన వారికి రెండు తులాల బంగారు నాణేలు ఇస్తారు. రెండో బహుమతిగా కిలో వెండి, మూడో బహుమతిగా యాపిల్ ఐఫోన్ ఇస్తామని స్కీమ్ లో ప్రకటించారు.


కరోనా, లాక్‌ డౌన్ సమయంలో వ్యాపారంలో బాగా నష్టపోయామని.. తమ కస్టమర్లను తిరిగి రప్పించుకునేందుకు ఈ స్పెషల్ ఆఫర్‌ ను ప్రకటించినట్లు రేణు గ్రాండ్ హోటల్ యాజమాన్యం చెప్పింది. ఈ ఆఫర్ లో కొసమెరుపేంటంటే.. హోటల్ లో తిన్నవారికి ఈ ఆఫర్ వర్తించదు. కేవలం పార్సిల్ తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. కేవలం 99 రూపాయలకే బిర్యానీ అందించినా, క్వాలిటీ, టేస్ట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడమంటున్నారు హోటల్ నిర్వాహకులు. జనవరి 1, 2022 నాడు లక్కీ డ్రా తీస్తారట. బిర్యానీ తింటే కడుపు నిండటంతో పాటు అదృష్టముంటే బంగారం కూడా గెలుచుకోవచ్చు అన్న ఆశతో కస్టమర్లు రేణూ గ్రాండ్ రెస్టారెంట్ ముందు క్యూ కట్టారు.