మీడియాపై ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలి: కాంగ్రెస్

Parliament

పార్లమెంట్‌లో మీడియాపై ఆంక్షలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మీడియాపై ఆంక్షలు సరికాదన్న ఆయన.. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా మీడియా ఉందన్నారు. అలాంటి మీడియాను పార్లమెంటులోకి అనుమతించకపోవడం అసాధారణం, బాధాకరమని లేఖలో పేర్కొన్నారు.

కరోనా కారణంగా గత ఏడాదిన్నరగా మీడియాను పార్లమెంటులోకి అనుమతించలేదు. ప్రస్తుతం మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, మార్కెట్లు సహా అన్నిచోట్లా కోవిడ్ నిబంధనలు తొలగించారు. కానీ కేవలం పార్లమెంటులో మీడియాపై మాత్రమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నారని కేంద్రం తీరును ప్రశ్నించారు.

మీడియా నిఘా లేకుండా చేయడం ప్రజాస్వామ్యంలో ఆందోళనకర పరిణామం. మీడియా కవరేజీపై విధించిన ఆంక్షలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రెస్ గ్యాలరీ పాసులను పునరుద్ధరించడంతో పాటు మీడియా కవరేజీకి తగిన సదుపాయాలు కల్పించాలని లేఖలో కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు.