రూ.45 కోట్లతో నాలాలో పూడిక తొలగింపు పనులు.. మంత్రులు తలసాని, మమమూద్ అలీ

జంట నగరాలలోని నాలాలపై  నిర్మించిన అక్రమ నిర్మాణాలకు పాల్పడిన  నిరుపేదలకు పునరావాసం కల్పిస్తూ.. నాలాల అభివృద్ధి పనులను చేపట్టేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ GHMC అధికారులను ఆదేశించారు.

నాలాలలో పూడిక తొలగింపు పనుల పై శుక్రవారం GHMC ప్రధాన కార్యాలయంలో మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాదు నగరాన్ని సుందర నగరంగా తీర్చి దిద్దేందుకు సీఎం కేసీఆర్ ఎంతో సహకరిస్తున్నారని, వినూత్నమైన ప్రణాలికలతో నగరాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు కేటీఆర్ నేతృత్వంలో GHMC పరిధిలో పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని మంత్రులు వివరించారు.

నగరంలో వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణం, VDCC రోడ్ల నిర్మాణం, నూతన ప్లై ఓవర్ లు, అండర్ పాస్ లు, జంక్షన్ ల అభివృద్ధి, LED లైట్ల ఏర్పాటు, వైకుంఠ ధామాల అభివృద్ధి వంటి అనేక పనులను చేపడుతున్న ఘనత TRS ప్రభుత్వానికే దక్కుతుందని వారు వివరించారు. అందులో భాగంగానే వర్షాకాలంలో నగరంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాలాలో పూడిక తొలగింపు పనుల కోసం దాదాపు రూ.45 కోట్ల రూపాయలను ఖర్చు కేటాయించినట్లు తెలిపారు.

జనవరి నెల నుండి ఇప్పటి వరకు ఆయా సర్కిల్స్ పరిధిలోని నాలాలో పూడిక తొలగింపు పనులు కొనసాగుతున్నాయని, దాదాపు 221 కిలోమీటర్లకుగాను 207 కిలోమీటర్లలో దాదాపు 4.5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించినట్లు CE దేవానంద్ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రతి నాలాకు ఆయా AE ల ద్వారా బాధ్యతలు అప్పగించి జియో ట్యాగింగ్ తో పూడిక తొలగింపు పనులను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.

ఆయా నాలాల పరివాహక ప్రాంతాలలో ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించుకున్న  నిరుపేదల జాబితా ను రూపొందించి వారికి నగరంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో పునరావాసం కల్పించి నాలా అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవసరమైన సమగ్ర నివేదిక రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. గత సంవత్సరం వర్షాకాలం సమయంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, GHMC కమిషనర్ లోకేష్ కుమార్,  ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్, ఆయా జోనల్ కమిషనర్ లు, ఇంజనీరింగ్ విభాగం CE దేవానంద్, SNDPCE వసంత, SE లు, DE లు పాల్గొన్నారు.