కారు కొనేందుకు షోరూం వెళ్తే అవమానించిన సేల్స్ మెన్.. 30 నిమిషాల్లో రూ.10 లక్షలు తెచ్చిన రైతు

salesmen Insulted Farmer in karnataka

హీరో పల్లెటూర్లో వ్యవసాయం చేస్తుంటాడు. కారు కొనేందుకు సిటీలోని షోరూం కు పోతాడు. కానీ అక్కడి సేల్స్ మెన్ అతడి డ్రెస్ ను చూసి.. అవమానిస్తాడు. కోపంతో హీరో గోనెసంచీలోని డబ్బును గుమ్మరిస్తాడు. దీంతో సేల్స్ మెన్ దిమ్మతిరుగుతుంది. ఇది 1999లో చిరంజీవి డబుల్ రోల్ లో నటించిన స్నేహం కొసం సినిమాలో జరిగిన సీన్.

కట్ చేస్తే అచ్చం అదే తరహాలో  కర్ణాటకలోని రైతుకు కూడా అలాంటి అవమానమే ఎదురైంది. చిక్కసంద్ర హోబ్లిలోని రమణపాళ్యకు చెందిన కెంపేగౌడ ఆర్‌ఎల్‌ అతని ప్రెండ్స్ లో కలిసి తన కలల కారు ఎస్‌యూవీని బుక్ చేసేందుకు తుమకూరులోని ఓ షోరూమ్‌ కు వెళ్లాడు. కానీ అక్కడి సేల్స్ మెన్ వారి డ్రెస్ ను చూసి కొనేవాళ్లు కాదని అవమానించాడు. జేబులో 10 రూపాయాలు లేకున్నా 10 లక్షల కారు కొనేందుకు వచ్చాడంటూ హేళన చేశాడు.

దీంతో కోపోద్రిక్తుడైన రైతు.. 10 లక్షలు తెస్తే ఇప్పుడే కారు డెలివరీ చేస్తావా? అంటూ సేల్స్ ఎగ్జిక్యూటీవ్, షోరూం మేనేజర్ కు కు సవాల్ చేశాడు. వారు సరే అనడంతో రైతు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సరిగ్గా 30 నిమిషాల్లో 10 లక్షలతో తిరిగొచ్చారు.

కానీ షోరూం వాళ్లు కారును డెలివరీ చేయలేకపోయారు. శని, ఆదివారాలు ప్రభుత్వ సెలవులు కావడంతో వారు కారును డెలివరీ చేయలేమని చెప్పారు. దీంతో కెంపేగౌడ, అతని స్నేహితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు డెలివరీ చేసేంత వరకు షోరూం వదిలి వెళ్లేది లేదని వారు అక్కడే నిరసన చేపట్టారు.

సమాచారం అందుకున్న తిలక్ పార్క్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వచ్చి వారికి నచ్చజెప్పి పంపించారు. తమను అవమానించిన షోరూం సిబ్బంది తమకు రాతపూర్వకంగా సారీ చెప్పాలని, వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరాడు. షోరూ నిర్వాహకుల తీరుతో కారు కొనాలన్న ఆసక్తి పోయిందని కెంపెగౌడ అన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు రైతు చొరవను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.