అభివృద్ధిని చూసి టీఆర్ఎస్‌ను ఆశీర్వ‌దించండి.. మంత్రి హ‌రీష్ రావు

సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ఆశీర్వ‌దించాల‌ని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు సిద్దిపేట ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో 15, 31 వార్డు అభ్య‌ర్థులు పాతూరి సులోచ‌నా శ్రీనివాస్ రెడ్డి, జంగిటి క‌న‌క‌రాజుల‌కు మ‌ద్ద‌తుగా హ‌రీష్ రావు శ‌నివారం ఉద‌యం ప్ర‌చారం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ఆక‌లైన‌ప్పుడు అన్నం పెట్టేటోడు కావాలా.. ఎన్నిక‌ల‌ప్పుడు వ‌చ్చి ఓట్లు అడిగే ఇత‌ర పార్టీలు కావాలా? అని అడిగారు.

ఒక‌నాడు నీళ్లు దొర‌క‌ని సిద్దిపేట‌లో ఇప్పుడు ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామ‌న్నారు. రూ. 270 కోట్ల‌తో సిద్దిపేట‌ను అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామ‌ని చెప్పారు.

సిద్దిపేట ప్ర‌జ‌ల ప్ర‌తి అవ‌స‌రాన్ని ఒక్కొక్క‌టిగా తీర్చుకుంటూ వ‌స్తున్నామ‌ని, సిద్దిపేట‌ను శుద్దిపేట‌గా మార్చుకున్నామ‌ని మంత్రి చెప్పారు.

ఎర్ర చెరువును అద్దంలా తీర్చిదిద్దామని.. కళ్యాణలక్ష్మి, సీఎం సహాయ నిధి తో ఎంతోమందిని ఆదుకున్నామ‌న్నారు. సిద్దిపేట టీఆర్ఎస్‌కు అడ్డా కావాలన్నారు. ఏడాది వరకు సిద్దిపేట‌కు రైలు రాబోతుంది అని మంత్రి హ‌రీష్ రావు అన్నారు.