సిటీ బీజేపీ కార్పొరేటర్‎పై సొంత పార్టీ నాయకుల దాడి

హైదరాబాద్ బీజేపీలో అంతర్గత గొడవలు బయటపడ్డాయి. చెరువుకు సంభందించిన భూవివాదంలో నాయకులు ఒకరిపై ఒకరు దాడిచేసుకోవడంతో విషయం పోలీస్‎స్టేషన్‎కు చేరింది. దాంతో శేరిలింగంపల్లి బీజేపీ నాయకుల మధ్య కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. గచ్చిబౌలి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్థానికంగా ఉన్న గోపన్ పల్లి చెరువును కబ్జా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో స్థానిక బీజేపీ నాయకులు యోగానంద్, మొవ్వ సత్యనారాయణలు చెరువు వద్దకు వచ్చి ఫొటోలు తీస్తున్నారు. విషయం తెలుసుకున్న గంగాధర్ రెడ్డి అక్కడకు వచ్చి.. వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. దాంతో గంగాధర్ రెడ్డి చందానగర్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, గోవర్ధన్ గౌడ్, జ్ఞానేంద్ర ప్రసాద్‎లు దాడిచేశారంటూ పోలీస్‎స్టేషన్‎లో ఫిర్యాదు చేశాడు. సామాన్యులకు చేదోడువాదోడుగా ఉండాల్సిన నాయకులే ఇలా కొట్టుకొని, పోలీస్‎స్టేషన్ మెట్లెక్కితే ఎలా అని స్థానిక ప్రజలు అంటున్నారు.