సీబీఐ, ఈడీ, నార్కోటిక్ సంస్థలను కేంద్రం ఎగదోస్తోంది.. నచ్చని వారిపై దాడులు చేయిస్తోంది

విపక్షాలను, కేంద్రాన్ని, బీజేపీని వ్యతిరేకించే వారిపై కేంద్రంలోని బీజేపీ టార్గెట్ చేస్తున్నదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, నార్కోటికస్ బ్యూరో వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. విపక్షాలపై దాడి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచడంలో విఫలం కావడం వల్లనే ఆ రాష్ట్రాన్ని టార్గెట్ చేసి విపరీత చర్యలకు దిగుతోందని శరద్ పవార్ అన్నారు. ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు.. తమ కూటమి నేతలపై కేంద్రం చేస్తున్న దాడులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌పై గతకొన్ని రోజులుగా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. మరోవైపు ఎన్సీపీకి చెందిన అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఇంటిపై ఇప్పటికే ఐదుసార్లు సీబీఐ సోదాలు చేసింది. వీటితోపాటు ఎన్సీబీ కొంతమంది ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరుపుతోంది. ఇలా కేవలం ప్రతిపక్షాలను టార్గెట్‌ చేయడం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను భాజపా దుర్వినియోగం చేస్తోందని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆరోపించారు. మరోవైపు డ్రగ్స్‌ కేసులో కేంద్ర సంస్థ కంటే రాష్ట్రస్థాయి నార్కొటిక్‌ విభాగమే ఉత్తమంగా పనిచేస్తోందని శరద్‌ పవార్‌ అన్నారు. బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌పై పవార్ విరుచుకుపడ్డారు. అధికారంలో లేకపోయినా ఇంకా ఆయన ముఖ్యమంత్రిగానే ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.