యూఏఈ కొత్త అధ్యక్షుడిగా షేక్‌ మొహమ్మద్‌

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కొత్త అధ్యక్షుడిగా షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ను ఫెడరల్‌ సుప్రీం కౌన్సిల్‌ శనివారం ప్రకటించింది. ఇంతకు ముందు అధ్యక్షుడిగా పని చేసిన షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ (73) శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే.

షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సోదరుడు అయిన మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ (61) దేశానికి మూడో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త అధ్యక్షుడు ఎన్నికకు అర్హత సాధించడానికి ముందు ఐదేళ్ల పదవీకాలం కోసం పదవీ బాధ్యతలు నిర్వహించనున్నారు.

అబుదాబిలోని అల్ ముష్రిఫ్ ప్యాలెస్‌లో ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ సమావేశమై యూఏఈ అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సమావేశానికి యూఏఈ వైస్ ప్రెసిడెంట్‌, ప్రధాన మంత్రి, దుబాయి పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షత వహించగా.. యూఏఈ పాలకులు హాజరయ్యారు.

షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ 2004 నుంచి అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్ గా.. అబుదాబికి 17వ పాలకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే జనవరి 2005 నుంచి యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్‌గా కూడా ఉన్నారు. యూఏఈ సాయుధ దళాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు.