బీజేపీతో పొత్తు వల్ల 25 ఏళ్లు వృథా: మహారాష్ట్ర సీఎం

Shiv Sena Wasted 25 Years in Alliance With BJP: Uddhav Thackeray

బీజేపీతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. ఆ పార్టీతో స్నేహం వల్ల శివసేన 25 ఏళ్లు వృథా అయ్యాయని అన్నారు. శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే 96వ జయంతి సందర్భంగా వర్చువల్​ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్ధవ్​ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉండడం వల్ల శివసేనకు 25 సంవత్సరాలు వృధాగా పోయాయనే ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు. మహారాష్ట్రకు బయటకూడా శివసేన కార్యకలాపాలను విస్తరిస్తామని, జాతీయస్థాయికి ఎదుగుతామని చెప్పారు.

ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సవాలును స్వీకరిస్తున్నట్లు చెప్పిన ఉద్ధవ్ థాక్రే.. అధికారం కోసమే బీజేపీ హిందుత్వ నినాదం చేస్తోందని ఆరోపించారు. శివసేన బీజేపీకి మాత్రమే దూరమైందని, హిందుత్వానికి కాదని అన్నారు. రాజకీయ అధికారం కోసమే బీజేపీ కాశ్మీర్‌లో పీడీపీతో, బీహార్‌లో జేడీయూతో పొత్తు పెట్టుకుందన్నారు. సేన, అకాలీదళ్‌ లాంటి పాత మిత్రులు పోవడంతో ఎన్‌డీఏ పరిధి తగ్గిందన్నారు.

2019 మహారాష్ట్ర ఎన్నికల అనంతరం బీజేపీకి గుడ్​ బై చెప్పింది శివసేన. ఎన్సీపీ, కాంగ్రెస్​తో చేతులు కలిపి మహా వికాస్ అఘాడి సర్కారు ఏర్పాటు చేసింది.