సిద్ధూ రాజీనామా.. కెప్టెన్ అమ‌రీంద‌ర్‌ సంచలన వ్యాఖ్యలు.. వివాదం మళ్లీ మొదలైనట్టేనా! - TNews Telugu

సిద్ధూ రాజీనామా.. కెప్టెన్ అమ‌రీంద‌ర్‌ సంచలన వ్యాఖ్యలు.. వివాదం మళ్లీ మొదలైనట్టేనా!పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ ప‌ద‌వికి న‌వ్‌జ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా చేయ‌డం, కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీ పర్యటన పంజాబ్ రాజకీయాల్లో అగ్గిని రాజేసింది. అమరీందర్ ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలను కల్వనున్నట్లు వార్తల వస్తున్న నేపథ్యంలో… సిద్ధూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం, రిజైన్ లెటర్ ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి పంపడం వెను వెంటనే జరిగిపోయాయి.

సిద్ధూ రాజీనామా చేసినట్టు చేసిన ట్వీట్ పై అమరీందర్ స్పందించారు. ‘‘నేను ముందే చెప్పాను. ఆయ‌న ఓ నిల‌క‌డ లేని వ్య‌క్తి. పంజాబ్‌లాంటి స‌రిహ‌ద్దు రాష్ట్రానికి అతను ప‌నికి రాడు’’ అని అమ‌రీంద‌ర్ ట్వీట్‌ చేశారు.

సిద్ధూ రాజీనామా చేయడంతో బీజేపీలో చేరే విషయంలో కెప్టెన్ మరి కొన్నాళ్లు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఈరోజు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ న‌డ్డాల‌ను కలిసి యోచనలో భాగంగానే ఆయన ఢిల్లీకి వచ్చినట్లు పంజాబ్ కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చలు జరిగాయి. కానీ అనుహ్యంగా సిద్ధూ రాజీనామాతో పరిస్థితులు తారుమారు అయినట్లు తెలుస్తోంది.

తాజాగా కెప్టెన్ అమరీందర్ సింగ్ తన ఢిల్లీ పర్యటనపై మీడియాతో స్పందించారు. తాను బీజేపీలో చేరడం లేదని, ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని ఖాళీ చేసేందుకు మాత్రమే వచ్చినట్లు కెప్టెన్ స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతానికి పంజాబ్ రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చినట్టేనని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తుండగా.. మరోవైపు వివాదం మళ్లీ మొదటికి వస్తుందేమోనని మరికొందరు నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఏడాది జులైలోనే పంజాబ్ పీసీసీ చీఫ్ ప‌ద‌వి చేప‌ట్టిన సిద్దూ.. రెండు నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఆ ప‌ద‌విని వ‌దులుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈలోపే మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం సిద్ధూకు మద్దతుగా నిలిచింది. దాంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న కెప్టెన్.. సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

అమ‌రీంద‌ర్ త‌ర్వాత సిద్ధూ మద్దతుదారు ద‌ళిత సిక్కు అయిన చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీని కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ ముఖ్య‌మంత్రిని చేసింది. వివాదం ముగిసిందని అనుకుంటున్న నేపథ్యంలో సిద్ధూ రాజీనామాతో అది మళ్లీ మొదటికొచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.