రూ.2.25 కోట్లతో సిందోల్ రోడ్డు: మంత్రి హరీష్ రావు

ప్రభుత్వం సిందోల్ రోడ్డు పనులకు ప్రత్యేక జీవో ద్వారా రూ.2.25 కోట్లు మంజూరు చేసిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సోమవారం రేగోడ్ మండలం సిందోల్ గ్రామ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణంతో సిందోల్ గ్రామ ప్రజల ఇక్కట్లు తీరుతాయన్నారు. మూడు నెలల లోపు రోడ్డు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని పంచాయతీరాజ్ ఎస్ఈని ఆదేశించారు.

కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినా రైతులకు సంబంధించిన రైతుబంధు కింద 57 లక్షల 60 వేల 608 మంది రైతులకు రూ.6,012 కోట్ల 72 లక్షలు రైతుల ఖాతాలలో జమ చేసినట్లు చెప్పారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించాలన్నారు. వానకాలం మొక్కజొన్న సాగుకు బదులుగా పత్తి, కంది సాగును చేయాలని సూచించారు.

ప్రభుత్వం త్వరలో ఎస్సీ నిరుద్యోగ యువత కోసం రూ. 1000 కోట్లతో దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ ను ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వం కులం, మతం, వర్గాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, అదనపు కలెక్టర్ రాజర్షి షా, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.