కవలలకు జన్మనిచ్చిన సింగర్.. సరోగసీ అంటున్న వారికి గట్టి సమాధానం

ప్రమఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిన్మయితో పాటు ఆమె భర్త, నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్ద‌రి పిల్ల‌ల చేతులను చిన్మయి, ఆమె భర్త పట్టుకున్న ఫోటోలను షేర్‌ చేస్తూ.. పిల్లల పేర్లను కూడా వెల్లడించారు. ఇద్దరిలో పాప పేరు ద్రిప్త అని.. బాబుకు శర్వాస్ అని పేరు పెట్టిన‌ట్లు తెలియజేశారు.

అయితే ఈ దంపతులు సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చారని కొందరూ ప్రచారం చేస్తుండటంతో.. ఈ విషయంపై కూడా చిన్మయి స్పందించారు. ‘నేను గర్భవతిగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేయనందుకే సరోగసీ ద్వారా కవల పిల్లలు పుట్టారా అని నన్ను అడుగుతున్న వారికి ధన్యవాదాలు. నా గురించి, నా కుటుంబం గురించి నా కుటుంబసభ్యులకు తెలుసు. మిగతా వారికి తెలియాల్సిన అవసరం లేదు. నా పిల్లలు ఈ లోకంలోకి వచ్చే సమయంలో నేను భజన పాట కూడా పాడాను’ అని జవాబిచ్చారు.

రాహుల్‌, చిన్మయిలది ప్రేమ వివాహం. 2014లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్లేబ్యాక్‌ సింగర్‌, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని దక్షిణాదిన ఉవ్వెతున ప్రచారం చేయడంలో కీలకపాత్ర పోషించారు.

ఇక రాహుల్‌ విషయానికొస్తే.. ‘అందాల రాక్షసి’చిత్రంతో టాలీవుడ్‌కి పరిచమయ్యాడు. హీరోగానే కాకుండా సహాయనటుడిగాను పలు సినిమాల్లో నటించాడు. నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో రాహుల్‌ పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. దర్శకుడిగాను రాణిస్తున్నాడు. ‘చి..ల..సౌ’ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించి, తొలి ప్రయత్నంలో విజయం సాధించాడు. చిన్మయి, రాహుల్‌ తల్లిదండ్రులు కావడంపై నెటిజన్స్‌, సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.